ఫ్లాప్ అయిన సినిమాలు ఎలాగూ 2-3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆచార్య, రాధేశ్యామ్, శాకుంతలం, రావణాసుర లాంటి పెద్ద సినిమాల్ని కూడా ఇలానే ఇచ్చేశారు. మరికొన్ని రోజుల్లో ఏజెంట్ కూడా వచ్చేస్తోంది. ఇక్కడివరకు ఓకే. కానీ హిట్టయిన సినిమాల్ని కూడా అంత తొందరగా ఓటీటీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పైగా థియేటర్లలో అంతో ఇంతో షేర్లు వస్తున్న సినిమాను ఓటీటీలో ఉన్నఫలంగా పెడితే ఏమనుకోవాలి?
విరూపాక్ష విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. ఈమధ్య కాలంలో పెద్ద హిట్టయిన సినిమా విరూపాక్ష. సాయితేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. అంతలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ ఆదివారం నెట్ ఫ్లిక్స్ లో విరూపాక్షను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.
అంటే.. సినిమా రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోందన్నమాట. సాధారణంగా ఇలా ఓటీటీకి సినిమాలిచ్చే అంశంపై 7 వారాల లాక్-ఇన్ నిబంధనలున్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కాబట్టి విరూపాక్ష యూనిట్ కూడా లైట్ తీసుకుందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మేటర్ అది కాదు..
బంగారం లాంటి రికార్డ్ మిస్..
కెరీర్ లో ఇప్పటివరకు వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వలేదు సాయిధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో అతడికి ఆ అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా 94 కోట్ల రూపాయల గ్రాస్ తో థియేటర్లలో నడుస్తోంది. మరికొన్ని రోజులు నడిస్తే సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ ఉంది. కానీ అంతలోనే ఆ అవకాశం లేకుండా చేసింది నెట్ ఫ్లిక్స్.
ఈ సినిమా మరో 4 రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుందని తెలిసిన తర్వాత, ఏరికోరి థియేటర్లకు ఎవరు వెళ్తారు? అలా కీలకమైన వీకెండ్ ను యూనిట్ చేజేతులా వదులుకుంది. వంద కోట్ల క్లబ్ లోకి వెళ్లే అవకాశాన్ని కళ్లముందు చేజార్చుకుంది.
తమ్ముడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అప్పట్నుంచే సాయితేజ్ పై ఒత్తిడి పెరిగింది. మీరు ఎప్పుడు ఆ క్లబ్ లోకి వెళ్తారనే ప్రశ్న, ప్రతి ప్రెస్ మీట్ లో కామన్ అయిపోయింది. ఎట్టకేలకు విరూపాక్షతో ఆ ఘనత దక్కించుకుంటాడని అంతా అనుకుంటున్న టైమ్ లో, ఇలా ముందుగానే ఓటీటీకి ఇచ్చేసి, సాయితేజ్ కు ఆ అవకాశం లేకుండా చేశారు మేకర్స్.