అక్టోబర్ 5న రెండు పెద్ద సినిమాలు పోటా పోటీగా విడుదల అవుతున్నాయి. మెగాస్టార్ నటించిన ‘గాడ్ ఫాదర్’ ఒకటి కాగా, నాగార్జున నటించిన ‘ఘోస్ట్’ మరొకటి.
ఇద్దరూ సీనియర్ హీరోలే. ఇద్దరూ మాంచి మిత్రులే. కానీ ఇద్దరూ కలిసి పోటీ పడుతున్నారు. అదే చిత్రంగా వుంది. అసలే సీనియర్ హీరోలకు టైమ్ అంత బాగా లేదు. ఇక్కడ అఖండ ఒక్కటే మినహాయింపు. మరో పక్క సినిమా రంగం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఇలాంటి టైమ్ లో మళ్లీ రెండు పెద్ద సినిమాలు ఒకటికి ఒకటి పోటీ పడడం అన్నది ఆలోచించాల్సిందే.
నిజానికి ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్లలో నాగ్ ఘోస్ట్ సినిమాను దసరా డేట్ కన్నా వారం ముందుగా విడుదల ప్లాన్ చేసారని తెలుస్తోంది. దాంతో మెగాస్టార్ సినిమాను దసరా డేట్ కు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఘోస్ట్ డేట్ కూడా మారి, సేమ్ డేట్ కు వచ్చింది.
విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం ఈ డేట్ ను హీరో నాగార్జునే స్వయంగా ఛూజ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆ డేట్ తో ఆయనకు వున్న అనుబంధం ఏమిటన్నది తెలియదు.
దాంతో ప్రస్తుతం అయితే ఈ రెండు సినిమాలు అక్టోబర్ 5 అంటూ ఫిక్స్ అయిపోయాయి. ఇదిలా వుంటే బెల్లంకొండ చిన్న కొడుకు గణేష్ నటించిన తొలిసినిమా స్వాతిముత్యం కూడా ఇదే డేట్ కు విడుదల కాబోతోంది. సితార సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అక్టోబర్ నాటికి థియేటర్ల హడావుడ పెద్దగా వుండదు కనుక మూడు సినిమాలు అయినా పెద్దగా సమస్య వుండదు. కానీ ఎటొచ్చీ ఎవరికి ఓపెనింగ్ వుంటుందన్నదే కీలకం.