మరోసారి గడ్డం గ్యాంగ్ లో చేరిన హీరో

రా అండ్ రస్టిక్ సినిమాల పేరిట హీరోలంతా గుబురు గడ్డాలు, బుర్ర మీసాలు పెంచే సంస్కృతిని ఎప్పుడో మొదలుపెట్టారు. రంగస్థలం సినిమా కంటే ముందే ఇది మొదలవ్వగా, ఆ సినిమా నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం…

రా అండ్ రస్టిక్ సినిమాల పేరిట హీరోలంతా గుబురు గడ్డాలు, బుర్ర మీసాలు పెంచే సంస్కృతిని ఎప్పుడో మొదలుపెట్టారు. రంగస్థలం సినిమా కంటే ముందే ఇది మొదలవ్వగా, ఆ సినిమా నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం చిన్న-పెద్ద తేడా లేకుండా హీరోలంతా ఈ 'పెంచుడు' కార్యక్రమంలో ఉన్నారు. హీరో నాగచైతన్య కూడా ఇప్పుడీ లిస్ట్ లోకి మరోసారి చేరాడు.

ఎస్కేన్, సాయిరాజేష్ నిర్మాతలుగా ఈరోజు కొత్త సినిమా మొదలైంది. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక ఇందులో హీరోహీరోయిన్లు. ఈ సినిమా ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు నాగచైతన్య. చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి కనిపించిన ఈ హీరో, తన లుక్ తో దాదాపు షాకిచ్చాడు.

ఇప్పటివరకు ఎన్నడూ పెంచనంత భారీగా గడ్డం పెంచాడు, లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఓ కొత్త లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా తన కొత్త సినిమా కోసమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. యదార్థ ఘటనల ఆధారంగా, సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార గ్రామాన్ని కూడా సందర్శించాడు చైతూ. ఆ తర్వాత మర పడవలో సముద్రంలోకి కూడా వెళ్లాడు. అలా తన క్యారెక్టర్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించిన నాగచైతన్య, ఇప్పుడు మేకోవర్ లో భాగంగా ఇలా తయారయ్యాడు.