గత ఎన్నికల టైమ్ లో కేఏ పాల్ ఆటలో అరటిపండులా మారితే.. ప్రస్తుత రాజకీయాల్లో నాగబాబు ఆ పాత్రను పోషిస్తున్నారు. తను కూడా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవడం కోసం అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టి, యూట్యూబ్ లో వీడియోలు వదుల్తుంటారు ఈ మెగా బ్రదర్. కానీ అలా చేసే కామెంట్స్ లో చాలామటుకు తిరిగి నాగబాబుకే బూమరాంగ్ లా రివర్స్ అయి, అతడి తల బొప్పి కడుతుంది.
ఈరోజు కూడా అలాంటి ఓ చవకబాబు కామెంట్ ఒకటి చేశారు నాగబాబు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ ట్వీట్ వదిలారు నాగబాబు. దీనిపై నెటిజన్లు కాస్త సీరియస్ గానే నాగబాబుకు గడ్డిపెట్టారు. నీకు అవసరమా ఇదంతా అనే రీతిలో కామెంట్స్ పెడుతూ నాగబాబుతో ఓ ఆట ఆడుకుంటున్నారు.
అవును.. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు చంద్రబాబు, పవనే కదా అంటూ ఒకరు రివర్స్ లో సెటైర్ వేస్తే.. ఇద్దరు కాదు.. చంద్రబాబు, పవన్ తో పాటు లింగమనేని అనే మూడో రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఉన్నాడంటూ మరికొరు కామెంట్ చేశారు. “నువ్వు కూడా సలహాలిస్తున్నావా నాగబాబూ” అంటూ మరికొందరు కాస్త సీరియస్ గానే కామెంట్స్ పెట్టారు.
రాష్ట్రం ఇలా తయారవ్వడానికి మీ తమ్ముడు (పవన్) కూడా కారణమనే విషయం తెలుసుకోమంటూ మరికొందరు సూచిస్తే.. “పాలిటిక్స్ లో ఛాలెంజ్ చేసి ఓడిపోయావ్.. జబర్దస్త్ లో ఛాలెంజ్ చేసి ఓడిపోయావ్.. ఇంకా నీకీ డైలాగ్స్ అవసరమా” అంటూ మరికొందరు కాస్త గట్టిగానే తగులుకున్నారు. తాజాగా జబర్దస్త్ (ఈటీవీ) నుంచి అదిరింది (జీ తెలుగు) అనే కార్యక్రమానికి షిఫ్ట్ అయ్యారు నాగబాబు. దీనికి సింబాలిక్ గా మీ ట్వీట్ అదరలేదు అంటూ తెగ పోస్టులు పడుతున్నాయి.
మూడు రాజధానుల అంశానికి భేషరతుగా మద్దతు ప్రకటించారు చిరంజీవి. ఏకంగా దీనిపై ఆయన బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. కనీసం విమర్శలు చేసేముందు, ట్వీట్లు వేసేముందు అన్నయ్యను సంప్రదించి ఉండాల్సిందంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద తన ట్వీట్ తో ఏదో కెలికేద్దాం అని భావించిన నాగబాబు.. అది తనకే రివర్స్ అయ్యేసరికి సైలెంట్ అయ్యారు.