బాగా మాట్లాడుతున్నానని నాగబాబు అనుకుంటారు. కానీ ఆ క్రమంలో పవన్ ను తనకు తెలియకుండానే భలేగా ఇరికించేస్తుంటారు. ఆమధ్య గాడ్సే ప్రస్తావన తెస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చివరికి అన్నయ్య వ్యాఖ్యలతో తనకు, పార్టీకి సంబంధం లేదని పవన్ ప్రకటించేవరకు వెళ్లింది వ్యవహారం.
ఇప్పుడిదంతా ఎందుకంటే, నాగబాబు మరోసారి గళం విప్పారు. ఈసారి కూడా ఆయన పవన్ ను పొగిడేందుకే మైక్ పుచ్చుకున్నారు. కానీ ఆ మాటల ప్రవాహంలో కొన్ని తూటాలు వచ్చేశాయి. పవన్ ను మరోసారి ఇరికించేశాయి.
ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే.. కల్యాణ్ బాబు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడంట, ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఒప్పుకోడంట. క్వాలిటీ ఉన్న సినిమాలే చేస్తాడంట.
సరిగ్గా ఇక్కడే కొంతమంది నెటిజన్లు నాగబాబుపై విరుచుకుపడుతున్నారు. పవన్ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరని, కేవలం రీమేక్స్ మాత్రమే చేస్తారని కొందరు సెటైర్లు అందుకున్నారు. క్వాలిటీ ఉన్న సినిమాలంటే గతంలో చేసిన పంజా, పులి, గంగతో రాంబాబు లాంటి సినిమాలా అంటూ మరికొందరు కామెడీ చేయడం మొదలుపెట్టారు.
ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏంటంటే.. తాజాగా వరుసపెట్టి రీమేక్స్ కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇలా వరుసగా రీమేక్స్ చేయడంపై అతడి అభిమానులే పవన్ పై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో పుండు మీద కారం చల్లినట్టు.. “క్వాలిటీ సినిమాలు, ఏది పడితే అది చేయడు” అంటూ నాగబాబు స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ రగిలిపోతున్నారు.
ఇప్పుడిప్పుడే చల్లారుతున్న ఈ మంటను నాగబాబు తిరిగి ఎగదోసినట్టయింది. ఆయన ఇంకా ఏమన్నారంటే…
“ఇండస్ట్రీలోకి వచ్చిన టైమ్ లో ప్లాన్ ఏంటని పవన్ ను అడిగాను. ప్లాన్ ఏం లేదన్నయ్యా, ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తానన్నాడు. ఆ టైమ్ లో చిరంజీవే ఏడాదికి 4-5 సినిమాలు చేస్తున్నారు. అదే ప్రశ్న అడిగితే క్వాలిటీ లేని సినిమాలు వంద చేసినా ఉపయోగం లేదన్నాడు. క్వాలిటీ ఉన్న సినిమాలు 20 చాలన్నాడు. హీరో అయిన తర్వాత విధానం మారుతుందని అనుకున్నాం. కానీ ఆరోజు కల్యాణ్ ఏం చెప్పాడో ఈరోజు అదే పాటిస్తున్నాడు. కల్యాణ్ బాబు అన్ని సినిమాలు చేయడు. ఏ సినిమా పడితే అది ఒప్పుకోడు. క్వాలిటీ ముఖ్యం”
నాగబాబు నోటి నుంచి ఇలాంటిదే మరో ఆణిముత్యం కూడా వచ్చింది. అత్యథికంగా డబ్బు సంపాదించిన హీరోల్లో పవన్ కల్యాణ్ ది మొదటి స్థానం అని, ఇప్పుడు అదే హీరో చేతిలో రూపాయి కూడా లేదని అన్నారు. “ఒక టైమ్ లో భారీగా సంపాదించిన హీరో కల్యాణ్. పవన్ కల్యాణ్ తర్వాత ఆ స్థాయిలో సంపాదించిన వ్యక్తి దగ్గర ఇప్పుడు వందల కోట్ల రూపాయలున్నాయి. కల్యాణ్ దగ్గర మాత్రం ప్రస్తుతానికి పైసా లేదు.” అంటూ మరో స్టేట్ మెంట్ ఇచ్చారు నాగబాబు.
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా పవన్ పై ట్రోలింగ్ కు కారణమయ్యాయి. ఇప్పటికే పవన్ పై ప్యాకేజీ ఆరోపణలున్నాయి. నాగబాబు ప్రకటనతో.. “పైసా లేకపోతేనేం ప్యాకేజీ ఉందిగా” ఉంటూ కొత్తగా మరో ట్రోలింగ్ మొదలైంది. ఇలా పవన్ ను మరోసారి ఇటు రాజకీయంగా, అటు సినిమాల పరంగా ఇరికించేశారు నాగబాబు.