విశాఖను టాలీవుడ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తామని ఇప్పటికే చాలామంది, చాలా స్టేట్ మెంట్స్ ఇచ్చారు. మరోవైపు విశాఖలో పెట్టిన రామానాయుడు స్టుడియోస్ కథ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో పెద్ద స్టుడియోలో వైజాగ్ కు వస్తుందా? మరీ ముఖ్యంగా ఎంతో చరిత్ర ఉన్న అన్నపూర్ణ స్టుడియో, బ్రాంచ్ వైజాగ్ లో పెడతారా?
ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చాడు నాగచైతన్య. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ అన్నపూర్ణ స్టుడియోస్ స్థాపించే ఉద్దేశం తనకు లేదని అనేశాడు.
“అన్నపూర్ణ స్టుడియోస్ విశాఖలో పెట్టడం లేదు. అందుకే మేం వైజాగ్ వచ్చి షూటింగ్స్ చేస్తుంటాం, ప్రెస్ మీట్స్ పెడుతుంటాం. నా ప్రతి సినిమాకు వైజాగ్ వచ్చి ప్రమోట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. స్టుడియో గురించి మాత్రం పెట్టే ఉద్దేశం లేదు, బట్ ఐ లవ్ వైజాగ్. ఒకవేళ పెట్టాలనుకుంటే ఆ నిర్ణయం నాన్న తీసుకుంటారు.”
ప్రేమమ్, మజిలీ సినిమాలతో తనకు వైజాగ్ తో ఎటాచ్ మెంట్ బాగా పెరిగిందంటున్నాడు నాగచైతన్య. స్క్రిప్ట్ లో వైజాగ్ ఎలిమెంట్ ఉందంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక అఖిల్ తో సినిమాపై స్పందిస్తూ.. మంచి స్క్రిప్ట్ దొరికితే అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించాడు.