నాగచైతన్య-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సినిమా. ప్రాజెక్టు అయితే పక్కా అయింది కానీ పుకార్లు మాత్రం ఎక్కువయ్యాయి. దీనికి కారణం రీసెంట్ గా సదరు దర్శకుడు మానాడు అనే హిట్ సినిమా తీయడం. ఆ సినిమా తెలుగు రీమేక్ లో నాగచైతన్య నటిస్తున్నాడంటూ ప్రచారం జరగడం. ఇప్పుడీ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.
నాగచైతన్యతో మానాడు రీమేక్ చేయడం లేదు వెంకట్ ప్రభు. కాకపోతే యాక్షన్ సినిమానే చేస్తున్నాడు. చైతూ కోసం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ సబ్జెస్ట్ రెడీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. 90ల నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రాబోతోంది.
తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఈ ద్విభాషా చిత్రం కోసం పూజాహెగ్డేను ట్రై చేస్తున్నారు. ఆమె ఓకే అన్న తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది.
మరోవైపు నాగచైతన్య మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాను పూర్తిచేసిన ఈ హీరో, అదే దర్శకుడితో కలిసి దూత అనే వెబ్ డ్రామా మొదలుపెట్టాడు. నిన్నట్నుంచి ఇది సెట్స్ పైకి వచ్చింది. ఇది పూర్తయిన తర్వాత నాగచైతన్య-వెంకట్ ప్రభు ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి.