నారా భువనేశ్వరిని కించపరిచారంటూ ఆమధ్య చంద్రబాబు గుక్కపెట్టి ఏడవడం, ఇటీవల బదులు తీర్చుకుంటూనంటూ చినబాబు సినిమా డైలాగులు చెప్పడం చూశాం. కానీ 2024 ఎన్నికల వరకు ఈ సబ్జెక్ట్ లైవ్ లోనే ఉంటుందా అనేది చాలామందిలో ఉన్న అనుమానం. కానీ టీడీపీ కార్యకర్తలకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్లాయి.
భువనేశ్వరి 2024 ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు “ఓ భువనమ్మా.. నీకు సాటి ఎవరమ్మా” అంటూ భారీ ప్రభ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫొటోలు చిన్నగా వేసి నిలువెత్తు భువనేశ్వరి కటౌట్ లాగా ప్రభను తీర్చిదిద్ది, మంటను రగల్చడానికే ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఎప్పుడూ నారా భువనేశ్వరి వ్యవహారం ఇంత ఇదిగా తెరపైకి రాలేదు. ఎన్టీఆర్ కుమార్తె అయినా కూడా.. ఆమెను ప్రచారానికి పిలిచేవారు కాదు చంద్రబాబు, ఆమెకు కూడా రాజకీయాలపై అంత ఆసక్తి లేదు. కానీ 2024లో నారా భువనేశ్వరి కూడా ప్రచార పర్వంలో దిగే అవకాశం ఉంది.
లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా ప్రచార పర్వంలో పాల్గొనాల్సిన అత్యవసర పరిస్థితి వస్తుంది. 2024 ఎన్నికల్లో గెలిస్తే గెలిచినట్టు, లేకపోతే ఇక ఎప్పటికీ టీడీపీకి భవిష్యత్తు ఉండదనే విషయం రూఢీ కావడంతో ఏ ఒక్క అవకాశాన్నీ చంద్రబాబు వదిలేలా లేరు. చివరికి తన భార్య 'భువనేశ్వరి ఎపిసోడ్'ను కూడా.
ఈరోజు జస్ట్ కటౌట్ మాత్రమే పడింది, రేపు ఎన్టీఆర్ కుమార్తెను, నందమూరి వారసురాలిని అంటూ ఆమె కూడా జనాల్లోకి వస్తారు. ఎన్టీఆర్ మనవడు, మనవరాలు.. ఇలా కుటుంబమంతా మరోసారి బయటకొస్తుంది. 2024 ఎన్నికల్ని నారావారి నాయకత్వంలో నందమూరి వారి సౌజన్యంతో ఎదుర్కోబోతోంది టీడీపీ.
వాస్తవానికి ఆమధ్య వల్లభనేని వంశీ సారీ చెప్పడంతో భువనేశ్వరి ఎపిసోడ్ ముగిసిపోయిందని అనుకున్నారంతా. కానీ వీలైనంత వరకు మంటలు ఎగదోయడానికే బాబు నిర్ణయించుకున్నారు. 2024 వరకు ఈ మంట ఆరకుండా చేయడమే ఆయన టార్గెట్ గా కనిపిస్తోంది.
ఇటీవల లోకేష్ విశాఖ పర్యటనలో, సంబంధం లేకపోయినా తల్లి గురించి మాట్లాడటం శపథాలు చేయడం ఈ నాటకంలో భాగమే. ఇప్పుడు భువనేశ్వరికి కటౌట్లు కట్టడం కూడా దాని కొనసాగింపే.