సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించిన అన్ని సినిమాలపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. గుంటూరుకారం, హనుమాన్, ఈగిల్.. ఇలా ఈ సినిమాలన్నింటిపై ఊహాగానాలు చెలరేగాయి. వాటిని సదరు సినిమా యూనిట్లు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాయి. అయితే ఒక్క సినిమా మాత్రం పుకార్లపై స్పందించకుండా పనిచేసుకుంటూపోతోంది. అదే నా సామిరంగా.
నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా నా సామిరంగా. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు గ్రాండ్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచేది కష్టమే అంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. చాలా తక్కువ టైమ్ ఉండడంతో, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమాను రిలీజ్ చేయడం కష్టమంటూ కథనాలు వస్తున్నాయి.
ఆశ్చర్యంగా, నా సామిరంగా యూనిట్ మాత్రం పుకార్లపై స్పందించడం లేదు. ఓవైపు సినిమా రాదంటూ ప్రచారం జరుగుతుంటే, మరోవైపు టోటల్ యూనిట్ అంతా షూటింగ్ లో బిజీ అయిపోయింది. ఇప్పటికే శరవేగంగా షూట్ చేస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టేశారు.
ఊహాగానాల ప్రకారం చూసుకుంటే, నా సామిరంగ సినిమా సంక్రాంతికి రావడం కాస్త కష్టమైన వ్యవహారమే. అదే టైమ్ లో నాగార్జున ఈ సీజన్ ను వదులుకుంటాడని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే, సంక్రాంతి నాగార్జనకు సెంటిమెంట్.
సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలతో సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకున్నాడు నాగ్. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు చూశాడు. దీంతో మరోసారి సంక్రాంతికొచ్చి హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. సో.. ప్రస్తుతానికైతే పుకార్లపై స్పందించే టైమ్ కూడా లేనంత బిజీగా సినిమాను రెడీ చేస్తున్నాడు నాగ్.