నాని హీరోగా నటించిన సినిమా అంటే సుందరానికి. ఈ వీకెండ్ ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచలేదు. అలా అని తగ్గించనూ లేదు. ఎఫ్3 రూటు ఫాలో అయ్యారు.
ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వం విధించిన టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో, అవే ధరలకు అంటే సుందరానికి సినిమాను ప్రదర్శిస్తున్నారు. దీని ప్రకారం, తెలంగాణ మల్టీప్లెక్సుల్లో అంటే సుందరానికి టికెట్ ధర 250 రూపాయలు (రీక్లెయినర్స్ కాకుండా) ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం విధించిన టికెట్ ధరలే అమల్లో ఉన్నాయి.
నిజానికి ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గిస్తారని అంతా అనుకున్నారు. మేజర్ సినిమాకు భారీగా టికెట్ రేట్లు దక్కించారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో మేజర్ మూవీ టికెట్ ధర 190 రూపాయలే. అలా నాని సినిమాకు కూడా ఓ మోస్తరుగా రేట్లు తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
సాధారణ టికెట్ రేట్లకు ఎఫ్3 సినిమాను రిలీజ్ చేయడంపై చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు టికెట్ రేట్లు ఇంకాస్త తగ్గించి ఉంటే మరింతమంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి ఉండేవారని, ఈ పాటికి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేదనేది కొంతమంది వాదన. 'అంటే సుందరానికి' సినిమా కూడా ఫ్యామిలీ సినిమానే. మరి ఈ సినిమాకు ఫుట్ ఫాల్ ఎలా ఉంటుందో చూడాలి.
నాని-నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ ఫన్ ఎంటర్ టైనర్.