నాని సినిమాల్లో కథలు కొత్తగా ఉండొచ్చు. కొన్ని హిట్ అవ్వొచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వొచ్చు. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రతి సినిమాలో నాని మాత్రం ఒకేలా కనిపిస్తాడు. అతడి లుక్, గెటప్ లో పెద్దగా మార్పులుండవు. ఏడాదికి 3 సినిమాలు చేసే నాని, అలాంటి ప్రయత్నం కూడా చేయాలనుకోడు.
కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో మాత్రం నాని గెటప్ మార్చక తప్పలేదు. శ్యామ్ పాత్ర కోసం బెంగాలీ యువకుడిగా మారిపోయాడు నాని. అయితే ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా లుక్ టెస్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు ఈ హీరో. దర్శకుడు, తనకు ఓ విజన్ ఉందని.. దానికి తగ్గట్టు సెట్ లోనే నేరుగా కొత్త గెటప్ లోకి మారిపోయానని చెప్పుకొచ్చాడు.
“కోల్ కతాలో ఫస్ట్ టైమ్ శ్యామ్ గెటప్ లోకి వచ్చాను. కారవాన్ లో రెడీ అయ్యాను. అదే ఫస్ట్ టైమ్. అప్పటివరకు లుక్ టెస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే, సినిమాలో వాసు పాత్ర షూటింగ్ కు టైమ్ సరిపోలేదు. అది చేసి, అప్పటికప్పుడు కారవాన్ లో శ్యామ్ గా మారాను. పంచె కట్టుకొని, బెంగాలీ గెటప్ లో కారవాన్ నుంచి అప్పుడే దిగాను. ఓ ప్రొడక్షన్ అబ్బాయి నన్ను అస్సలు గుర్తుపట్టలేదు. పలకరిస్తే అప్పుడు గుర్తుపట్టాడు. టీమ్ రియాక్షన్ అప్పుడే చూశాను.”
ఫొటోలు తీసి లుక్ టెస్ట్ చేయకుండా.. నేరుగా టీమ్ రియాక్షన్ చూసి లుక్ ఫిక్స్ చేశామని తెలిపాడు నాని. శ్యామ్ గెటప్ బాగా కుదిరిందనే విషయం అప్పుడే తనకు అర్థమైందని, ట్రయిలర్ చూసిన తర్వాత చాలామంది అదే ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చాడు.
కథ డిమాండ్ చేస్తే కొత్తగా కనిపించడాని, కొత్త గెటప్ లోకి మారడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్న నాని, ఇప్పటివరకు అలాంటి కథలు తనకు దొరకలేదు కాబట్టి రెగ్యులర్ గానే కనిపించానని చెప్పుకొచ్చాడు. అయితే శ్యామ్ గెటప్ క్లిక్ అయిందని, ఇకపై గెటప్పుల కోసం కథలు ఒప్పుకోనని, స్టోరీకి సెట్ అయ్యే లుక్ లోనే కనిపిస్తానని క్లారిటీ ఇచ్చాడు.