జస్టిస్ చంద్రు ఏం చేసినా, ఏం చెప్పినా సమాజ శ్రేయస్సు కోసమే. పీడిత, తాడిత వర్గాల ప్రజల బతుకుల కోసమే ఆయన జీవితాన్ని అర్పించారు. జైభీం సినిమా ఫేంగా ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆయన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ దఫా ఆయన మాటల తూటాలు ఎటు వైపు దూసుకెళుతాయోననే ఆందోళన చాలా మందిలో ఉండింది. అయితే ఆయన అందరి భయాలను పోగొడుతూ, ధైర్యం నింపే మాటలే చెప్పడం విశేషం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు-పరిష్కార మార్గాలు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలు చెప్పారు.
న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మాబొరుసులాంటివని జస్టిస్ చంద్రు అన్నారు. అంతేకాదు, చదువుతో పాటు ధైర్యం లేకపోతే సమాజంలో మార్పు రాదనే విషయాన్ని స్పష్టం చేశారు. చదువు ధైర్యాన్ని ఇవ్వాలే తప్ప పిరికితనం కాదని పరోక్షంగా చురకలు అంటించారు. వ్యవస్థలో మార్పు కోసం పోరాడేందుకు చదువుకుంటేనే సరిపోదని, ధైర్యం కూడా ఉండాలని జస్టిస్ చంద్రు సూచించారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు.
సమ్మె చేశారనే కారణంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తే, వారంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ముందుకు రాలేదనే షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఇదే జైభీం సినిమాలో రాజుకన్న భార్య పోలీసులు ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థను కదిలించిందని చెప్పుకొచ్చారు.
జీవితంలో ధైర్యం వుంటేనే ఏదైనా సాధించగలమని ఆయన స్ఫూర్తి నింపేందుకు యత్నించారు. ఆర్టీసీ కార్మికులంతా కొద్దోగొప్పో చదువుకున్నోళ్లని, జైభీం సినిమాలో రాజుకన్న భార్య నిరక్షరాస్యులని పోల్చి చెప్పడం వెనుక ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.