మారేడుమిల్లి ప్ర‌జానీకం అల్ల‌రి న‌రేష్‌ను ర‌క్షిస్తుందా?

అల్ల‌రి న‌రేష్ ప్ర‌త్యేక‌మైన న‌టుడు. చంద్ర‌మోహ‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత మంచి కామెడీ టైమింగ్ వుంది. ఎక్కువ సెంటిమెంట్‌, ఎమోష‌న్ లేకుండా ప్ర‌త్యేక‌మైన కామెడీ ట్రాక్‌ల‌తో ఆయ‌న కోస‌మే క‌థ‌లు త‌యారయ్యేవి. వాటికి మినిమం గ్యారెంటీ…

అల్ల‌రి న‌రేష్ ప్ర‌త్యేక‌మైన న‌టుడు. చంద్ర‌మోహ‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత మంచి కామెడీ టైమింగ్ వుంది. ఎక్కువ సెంటిమెంట్‌, ఎమోష‌న్ లేకుండా ప్ర‌త్యేక‌మైన కామెడీ ట్రాక్‌ల‌తో ఆయ‌న కోస‌మే క‌థ‌లు త‌యారయ్యేవి. వాటికి మినిమం గ్యారెంటీ కూడా వుండేది. కామెడీని ఇష్ట‌ప‌డే వాళ్లు త‌ప్ప‌కుండా చూసేవాళ్లు.

ఈవీవీ ఉన్న‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న అంద‌రు క‌మెడియ‌న్లతో ఆయ‌న సినిమాలుండేవి. ఇదంతా న‌రేష్‌కి బ‌లం. మిగ‌తా హీరోల సినిమాలు ఒడిదుడుకుల‌కి గురైన న‌రేష్‌వి మాత్రం ఏడాదికి రెండు మూడు వ‌చ్చేవి.

జ‌బ‌ర్ద‌స్త్ అనే టీవీ షో న‌రేష్ జాతకాన్ని మార్చివేసింది. కొంచెం అశ్లీల‌త వున్నా జ‌నానికి న‌చ్చేసింది. 15 నిమిషాల ట్రాక్‌లో కొన్ని తుస్సుమ‌న్నా, మిగ‌తావి బాగా న‌వ్వించాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, ఆది, చ‌లాకీ చంటీ, బులెట్ భాస్క‌ర్ టీంలు షోకి బ‌లంగా నిలిచాయి. అతి త‌క్కువ టైంలో స్కిట్‌లో న‌వ్వించాలి కాబ‌ట్టి వ‌రుస‌గా పంచ్‌లు, సెటైర్లు పేలేవి. జ‌బ‌ర్దస్త్‌ని ఇమిటేట్ చేస్తూ అనేక కామెడీ షోలు వ‌చ్చాయి.

దాంతో అల్ల‌రి న‌రేష్ సినిమాల‌కి డిమాండ్ త‌గ్గింది. జ‌బ‌ర్దస్త్‌కి మించి ట్రాక్‌లు రాయ‌గ‌లిగితే త‌ప్ప జ‌నానికి ఆన‌డం లేదు. దాంతో వ‌రుస ప్లాప్‌లు. సినిమాలో కామెడీ సీన్స్ కోసం ఎదురు చూడ‌డం కంటే , కంటిన్యూగా న‌వ్వించే జ‌బ‌ర్ద‌స్త్ ప్రేక్ష‌కుల‌కి బెట‌ర్ అనిపించింది.

జ‌బ‌ర్ద‌స్త్‌తో న‌రేష్‌కే కాదు, సినిమాల్లోని క‌మెడియ‌న్స్ అంద‌రికీ స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి. కామెడీ ట్రాక్స్ త‌గ్గిపోయాయి. చిన్న‌చిన్న బిట్స్ వుంటే జ‌బ‌ర్ద‌స్త్ న‌టుల్నే తెచ్చి పెడుతున్నారు. అయితే వాళ్లు కూడా సినిమాల్లో క్లిక్ కావ‌డం లేదు.

కామెడీ సినిమాలు త‌గ్గే స‌రికి న‌రేష్ ట్రాక్ మార్చి సీరియ‌స్ సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకంలో వున్నాడు. పోస్ట‌ర్ చూస్తే డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. మంచం కోడు భుజంపై మోస్తూ, ర‌క్తం కారుతున్న చేతుల‌తో వున్న న‌రేష్‌ని చూస్తే గిరిజ‌నుల స‌మ‌స్య‌కి సంబంధించిన సినిమాలా వుంది. 

మామూలుగా నారాయ‌ణ‌మూర్తి ఇలాంటి సినిమాలు తీస్తాడు. ఏజెన్సీలో వైద్య స‌దుపాయాలు లేని ప‌రిస్థితి, ప్రాణం మీద‌కి వ‌స్తే గ‌ర్భిణీస్త్రీల‌ను మంచం మీద మోసుకొచ్చే దుస్థితులు సినిమాలో వున్న‌ట్టున్నాయి. హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న న‌రేష్‌ని మారేడుమిల్లి ప్ర‌జ‌లు ఆదుకుంటారో లేదో చూడాలి.

జీఆర్ మ‌హ‌ర్షి