జాతీయ మహిళా కమిషన్ దృష్టికి ‘రేప్’ వ్యాఖ్యలు

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వీడియో రిలీజైన వెంటనే త్రిష, ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. త్రిషకు చాలామంది ప్రముఖులు బాసటగా నిలిచారు. ఇప్పుడీ వివాదం మహిళా…

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వీడియో రిలీజైన వెంటనే త్రిష, ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. త్రిషకు చాలామంది ప్రముఖులు బాసటగా నిలిచారు. ఇప్పుడీ వివాదం మహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించింది ఎన్సీడబ్ల్యూ.

త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, అదే సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు కమిషన్ ను ఎంతో బాధించాయని తెలుపుతూ.. అతడిపై తక్షణం కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్ మీడియాలో లైంగిక ఆరోపణలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 509-బి కింద మన్సూర్ పై కేసు నమోదు చేయబోతున్నారు పోలీసులు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసే సహించేది లేదని స్పష్టం చేసిన మహిళా కమిషన్… ఏ మాధ్యమంలో వ్యాఖ్యలు చేసినా తమ దృష్టికొస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది.

లియో సినిమాలో మన్సూర్ నటించాడు. అందులో త్రిష హీరోయిన్. గతంలో ఎన్నో రేప్ సీన్స్ లో నటించిన తనకు లియోలో త్రిషను అత్యాచారం చేసే సీన్ దక్కలేదంటూ స్పందించాడు మన్సూర్. అలాంటి సన్నివేశం లేనందుకు బాధ వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల్ని త్రిష ఖండించింది. మన్సూర్ కు మానవత్వం లేదంటూ తిట్టిపోసింది.

మరోవైపు లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో, అతడు కూడా స్పందించాడు. మన్సూర్ వ్యాఖ్యల్ని ఖండించాడు. మన్సూర్ పై ఇదివరకే లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పుడు అదనంగా మరో కేసు అతడి మెడకు చుట్టుకోబోతోంది.