సెలబ్రిటీలకు సంబంధించి ప్రతీదీ వింతే. వారూ మనలాంటి మనుషులే అనే విషయం గుర్తు రాకూడదన్నట్టుగా మీడియా హడావుడి చేస్తూ ఉంటుంది. గోరంతలను కొండంతలు చేయడం.. వారి విషయంలో ప్రతీదీ ప్రత్యేకంగా మార్చి, వండి వార్చడంలో మీడియా తన వంతు పాత్రను ఎక్కడా తగ్గకుండా పోషిస్తూ ఉంటుంది.
వాళ్లూ మనుషులే, వాళ్లకూ కనీస భావోద్వేగాలుంటాయి, వారు కూడా మనలాగే రియాక్ట్ అవుతారనే.. ఆధారాలు ఏవైనా దొరికాయంటే ఇంక అంతే సంగతులు! అదేదో అపురూపం అయినట్టుగా.. అంతకు మించిన వండర్ లేదన్నట్టుగా కథలు, కథనాలు ప్రసారం అవుతూ ఉంటాయి.
ఓవరాల్ గా ఎవరైనా సెలబ్రిటీ ఏదో రకంగా మీడియాకు దొరికాడంటే.. అది మంచిగా కావొచ్చు, చెడుగా కావొచ్చు, కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా మారింది వ్యవహారం. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన వార్తలు ఇలానే ఉన్నాయి.
కదిలే క్రూజ్ షిప్ పై డ్రగ్స్ వినియోగంతో ఎన్సీబీకి దొరికిన ఆర్యన్ ఖాన్ కు సంబంధించి పక్షం రోజులుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో జాతీయ మీడియా లెక్కలేనన్ని కోణాల్లో వార్తలను వండి వార్చింది. ఇప్పుడు తాజా ఖబర్ ఏమిటంటే.. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చే వరకూ తన ఇంట్లో స్వీట్లు వండద్దని గౌరీ ఖాన్ పనిమనుషులకు ఆదేశాలు ఇచ్చిందట! ఇదీ జాతీయ మీడియా వెబ్ సైట్లలో పతాక శీర్షికల్లోని వార్త!
ఇది తాము సేకరించిన అత్యంత ఎక్స్క్లూజివ్ కథనం అయినట్టుగా.. జాతీయ మీడియా కథనాలను ఇస్తూ ఉంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తనయుడు ఇలా అరెస్టు అయితే గౌరీ ఖానే కాదు, ఏ తల్లి అయినా ఇంట్లో స్వీట్లు వండించుకుని తినే మూడ్ లో ఉండదు.
షారూక్, గౌరీ రేంజ్ పేరెంట్స్ తమ పిల్లలను మరింత గారాబంగా పెంచి ఉండటం కూడా వింత కాదు. వారి కళ్లలో ధూళి పడితే వీరి కళ్లలో నీళ్లు రావొచ్చు. ఇంట్లో మనిషి జైల్లో ఉంటే, వాడికి పోలీసులు పెట్టే తిండి తినలేకపోతున్నాడంటే… ఇంట్లో వాళ్లు సరిగా భోజనం కూడా చేయలేకపోవచ్చు. ఇదంతా వివరించి చెప్పాల్సిందేమీ కాదు.
ఇక పక్షం రోజుల నుంచి రాస్తూనే ఉన్నారు.. షారూక్ ఖాన్ చాలా డిప్రెషన్లో ఉన్నాడని, అసహాయుడిగా మిగిలిపోయాడని, బాధపడుతున్నాడని.. ఇదంతా రాసిన తర్వాత, ఇప్పుడు మళ్లీ ఇంట్లో స్వీట్లు వండొద్దని గౌరీ తన పనిమనుషులకు చెప్పినట్టుగా ప్రత్యేక కథనాలను ఇవ్వడం జాతీయ మీడియాకే చెల్లినట్టుగా ఉంది! ఏదో ఒలింపిక్ గేమ్స్ కు ఏర్పాట్లు చేయమన్నట్టుగా ఆదేశాలు ఇచ్చిన రేంజ్ లో, ఇంట్లో స్వీట్లు వండొద్దు అని గౌరీ ఆదేశాలు అంటూ ఆ వార్తలను ఇస్తున్న మీడియాను చూస్తుంటే.. సగటు పాఠకుడు నవ్వుకోవడం మినహా ఇక చేసేదేముంది!