పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఆల్రెడీ సమీక్షలు వచ్చేశాయి. మరి ఈ సినిమాపై నేషనల్ మీడియా రివ్యూ ఏంటి? ప్రముఖ మీడియా సంస్థలు ఈ సినిమాపై ఎలా స్పందించాయి?
బ్రో సినిమాపై జాతీయ మీడియా పాజిటివ్ దృక్పథాన్ని వ్యక్తం చేయలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే బ్రో సినిమా వాళ్లకు నచ్చలేదు. ఈ బోరింగ్ సినిమాను పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ రక్షించలేరంటూ ప్రముఖ దినపత్రిక 'ది హిందూ' అభిప్రాయపడింది. పవన్ హిట్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్ పై ఆధారపడి సినిమా తీస్తే, ఫ్రెష్ నెస్ మిస్ అవుతుందని, ఫలితంగా సినిమా మిస్ ఫైర్ అవుతుందని తేల్చింది.
మరో ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఈ సినిమా కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే అని విశ్లేషించింది. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని పవన్ ఇమేజ్ ను బిల్డప్ చేయడానికి ఓ అవకాశంగా వాడుకున్నారని, అటు పవన్ కూడా తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం ఈ సినిమాను వాడుకున్నట్టు కనిపించిందంటూ రివ్యూ ఇచ్చింది.
కథపై ఆధారపడకుండా కల్యాణ్ క్రేజ్ పై ఆధారపడి సినిమాలు తీస్తే బ్రో లాంటి మూవీసే వస్తాయని మరో ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా తన సమీక్షలో రాసింది. జీవించడానికి రెండో అవకాశం పొందిన ఓ వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సెట్ చేసుకునే సన్నివేశాల్ని చాలా వేగంగా చూపించారని, ఈ క్రమంలో ఇవ్వాల్సిన సందేశాన్ని చాలా ఆలస్యంగా ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఓవరాల్ గా ఓ మంచి కథను సక్సెస్ ఫుల్ గా చెప్పే అవకాశాన్ని బ్రో మూవీ మిస్ చేసుకుందని రాసుకొచ్చింది.
“ఒక ఉద్దేశంతో రాసిన ఈ సినిమా డైలాగుల్లో నిలకడ లేదు. ఒకసారి సమానత్వం గురించి డైలాగ్స్ ఉంటాయి, ఆ వెంటనే ఐటెంసాంగ్ వస్తుంది. దీనికి తోడు ధనవంతులు మాత్రమే పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతుంటారు లాంటి డైలాగ్‌లు ఉన్నాయి. ప్రాస కోసం లాజిక్ లేకుండా రాసినట్టున్నాయి ఈ డైలాగ్స్. బ్రో అనేది ఓ సాధారణ కమర్షియల్ సినిమా అయితే, దాన్ని అంతే సరళంగా చెప్పాలి కదా. ఓ అద్భుతమైన ఐడియాను నాసిరకంగా చెప్పారు.” ఇలా సినిమాలో కొన్ని నవ్వులు మినహా ఇంకేం లేదంటూ స్పందించింది “ఫస్ట్ పోస్ట్”.
ఇక ఇండియా టుడే అయితే, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే తీశారని స్పందించింది. బ్రో సినిమాను నిజాయితీగా రీమేక్ చేసి ఉండాల్సిందని, అదనంగా పెట్టిన హంగులన్నింటినీ తగ్గిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. స్పెషల్ సాంగ్, పవన్ పాత సినిమాల రిఫరెన్సులతో నింపేసి వినోదాయశితం ఔన్నత్యాన్ని తగ్గించేశారని విశ్లేషించింది.
ఇలా నేషనల్ మీడియాలో 80 శాతానికి పైగా సమీక్షలు బ్రో సినిమా బాగాలేదని రాశాయి. రీమేక్ లో నిజాయితీ లేదని, వ్యక్తిగత ఎజెండా, స్టార్ డమ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలే ఎక్కువగా కనిపించాయని విశ్లేషించాయి.