నవ్విన ‘నక్కిన’ గెలిచాడు

ఒక్కోసారి అంతే..పోటుగాళ్లం అనుకున్నవాళ్లు వెనుకబడతారు. వీడేం పీకుతాడులే అన్నవాడు చితక్కొట్టేస్తాడు. ఉన్న మాట మాట్లాడుకుందాం. చాలా మంది..అందరూ కాదు. కొంత మంది టాలీవుడ్ డైరక్టర్లకు ‘ధమాకా’ నక్కిన త్రినాధరావు అంటే పెద్దగా అభిప్రాయం లేదు.…

ఒక్కోసారి అంతే..పోటుగాళ్లం అనుకున్నవాళ్లు వెనుకబడతారు. వీడేం పీకుతాడులే అన్నవాడు చితక్కొట్టేస్తాడు. ఉన్న మాట మాట్లాడుకుందాం. చాలా మంది..అందరూ కాదు. కొంత మంది టాలీవుడ్ డైరక్టర్లకు ‘ధమాకా’ నక్కిన త్రినాధరావు అంటే పెద్దగా అభిప్రాయం లేదు. ‘నీ ఫేస్ నాకు నచ్చలేదు’ అన్నట్లుగా నక్కిన మాట తీరు, వ్యవహారం నచ్చదు. మరీ నేలబారుగా వుంటుంది కదా. అస్సలు కల్మషం లేకుండా నవ్వేసి, స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ఆడేస్తాడు. తనకు తన రచయిత బెజవాడకు ఎన్ని గొడవలు వున్నా, మొహమాటం లేకుండా ఒప్పేసుకుంటాడు. అలా అని ఇద్దరూ విడిపోరు. మళ్లీ అలా అని బెజవాడ ప్రసన్న డైరక్టర్ కావాలని త్రినాధరావు కూడా ఒప్పుకుంటాడు.

రవితేజకు క్రాక్ తరువాత అన్నీ ఫ్లాపులే. కానీ ధమాకా బ్లాక్ బస్టర్. అలా అని ధమాకా ఏమీ గొప్ప సినిమా కాదు. కానీ మాస్ జనాలకు ఏం కావాలో అలాంటి సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు నక్కినకు గొప్ప గౌరవం ఏమీ ఇచ్చేయలేదు ఎవ్వరూ. హీరో రవితేజ గతంలో చేసిన సినిమాల ఇంటర్వూల్లో దర్శకులకు దక్కిన గౌరవ ప్రదమైన స్థానం నక్కిన త్రినాధరావుకు ఏ మాత్రం దక్కలేదు. జస్ట్ పక్కన పడేసారు. పైగా స్టేజ్ మీద ‘కల్లు తాగిన కోతిలా గెంతాడు’ అని హీరో రవితేజ స్వయంగా వెక్కిరించాడు. తనకు హిట్ లు ఇచ్చిన డైరక్టర్లతో ముచ్చట్లు పెట్టాడు కానీ త్రినాధరావును పిలవనే లేదు.

మళ్లీ చెప్తున్నా..త్రినాధరావు గొప్ప సినిమా తీయలేదు. నేలబారు సినిమా తీసాడు. గొప్ప కథ రాయలేదు. పాత చింతకాయపచ్చడి కథే. కానీ రవితేజ ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఇచ్చాడు. ఎలాంటి పాటలు కావాలో అలాంటివి చేయించుకున్నాడు. తన సన్నిహితుడు బెజవాడ ప్రసన్నతో కలిసి తను ఏం చేయగలడో అదే చేసాడు. పాష్ గా వుండడు. పాలిష్ గా మాట్లాడలేడు. నేలబారుగానే వుంటాడు. నోటి నచ్చింది మాట్లాడతాడు. మనసులో ఏదీ దాచుకోడు. ఎవరు ఏమనుకుంటారో అనుకోడు.

ఆ మాటకు వస్తే ఈ హై ఫై వ్యవహారాల్లో అస్సలు ఇమడలేడు. కానీ 18 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే రవితేజకు చాలా మంది పాలిస్డ్ డైరక్టర్లు ఇవ్వలేని హిట్ ఇచ్చాడు. ఇప్పటికైనా విడుదలకు ముందు దూరంగా వుంచిన డైలాగ్ రైటర్ ప్రసన్నను..’కల్లు తాగిన కోతి’ అని తను బిరుదు ఇచ్చిన త్రినాధరావును పిలిచి రవితేజ శహభాష్ అనగలడా? ఏమో?

ఎందుకంటే ఇది టాలీవుడ్..ఇక్కడ కావాల్సింది సమర్థత కాదు..ఇంకా చాలా..ఇంకా వేరే.