డబ్బింగ్ సినిమాతో అలరించబోతున్న నయనతార

కెరీర్ లో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చింది నయనతార. తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయించగా, ఏమైనా మిగిలితే తెలుగు సినిమాలకు కేటాయించేది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో సక్సెస్ వచ్చింది. షారూక్ సరసన…

కెరీర్ లో ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చింది నయనతార. తమిళ సినిమాలకు కాల్షీట్లు కేటాయించగా, ఏమైనా మిగిలితే తెలుగు సినిమాలకు కేటాయించేది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో సక్సెస్ వచ్చింది. షారూక్ సరసన నయన్ నటించిన జవాన్ సినిమా పెద్ద హిట్టయింది. దీంతో ఆమె మార్కెట్ మరింత పెరిగింది. సో.. ఇక తెలుగులో ఆమె కనిపించడం కష్టమే.

ఇకపై డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కువగా పలకరించబోతోంది నయనతార. ఇందులో భాగంగా ఆమె నటించిన ఓ తమిళ సినిమా, తెలుగులో విడుదలకు సిద్ధమైంది. సినిమా పేరు గాడ్. తమిళ్ లో విడుదలైన ఇరైవన్ అనే సినిమాకు తెలుగు వెర్షన్ ఈ గాడ్. జయంరవి హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా చేసింది.

మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది గాడ్ సినిమా. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ ఆకట్టుకుంటోంది. పక్కా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెబుతోంది యూనిట్. ఇలాంటి కథలు నయనతారకు కొత్తకాదు. కాకపోతే ఇందులో ఆమె పాత్ర ఇంకాస్త కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమాను తెలుగులో జయంరవి పేరుతో కాకుండా.. నయనతార బ్రాండింగ్ మీద ప్రమోట్ చేస్తున్నారు. జయం రవి కంటే తెలుగులో నయనతార బాగా పాపులర్ కాబట్టి, ప్రమోషన్ ను ఇలా టర్న్ చేశారు.

గాడ్ ఫాదర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని, ఇప్పుడీ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకురాబోతున్న నయనతార, గాడ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.