సోషల్ మీడియాలో ఎప్పుడే డిమాండ్ తెరపైకి వస్తుందో ఊహించలేం. తాజా ఘటనలు పాత సంగతులను తెరపైకి తెస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే సోషల్ మీడియాలో రచ్చవుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో…ఆయన మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో అతిలోక సుందరి శ్రీదేవి అనుమానాస్పద మృతిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ సోషల్ మీడి యాలో ఊపందుకొంది. ఆల్ ఇండియా అందగత్తె శ్రీదేవి మరణం యావత్ భారత జాతిని విషాదంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. 2018, ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఓ హోటల్ రూం బాత్ టబ్‌లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి మృతికి ఆమె భర్త బోనీకపూరే కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
కానీ అనుమానాలు నివృత్తి కాకుండానే కాలం ముందుకు సాగిపోతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరుగుతుండడంతో శ్రీదేవి అభిమానులు, కొందరు నెటిజన్లు తెరపైకి కొత్త నినాదం తీసుకొచ్చారు. అందులోనూ శ్రీదేవి పుట్టిన రోజు ఆగస్టు 13కు మరి కొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో…తమ డిమాండ్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
శ్రీదేవి అభిమానులు సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి’అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. శ్రీదేవి మరణంపై ఎందుకు సీబీఐ విచారణ చేయలేదని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు చేపట్టిన ఉద్యమం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి. సీబీఐ ఎంక్వైరీ సంగతేమో గానీ…ఈ రచ్చ మాత్రం కొంత కాలం తప్పక సాగుతుంది.