ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉండూరు అచ్చిరాదనే సామెత చందాన స్టార్ హీరోయిన్ పరిస్థితి తయారైంది. హీరో సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో రేపిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ కరీనా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంపై నిర్మొహమాటంగా మాట్లాడి…అనవసరంగా నెటిజన్ల నుంచి తల నొప్పులు తెచ్చుకొంది. ఏకంగా కరీనా సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్‌కి కరీనా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నెపోటిజంపై అడిగిన ప్రశ్నకు కరీనా తన మనసులో మాటను నిర్మొహమాటంగా బయటికి చెప్పేశారు.
కరీనా ఏమన్నారంటే.. ‘నెపోటిజం అనేది కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైనట్టు మాట్లాడుతున్నారు. సుశాంత్ మరణంతో ఇది పతాక స్థాయికి చేరింది. స్టార్‌కిడ్స్‌ని ఇండస్ర్టీలోకి తెచ్చినప్పుడు ఈ ప్రేక్షకులే కదా వాళ్లని అసలైన స్టార్స్‌గా చేసేది. ఎవరూ కూడా ఒక్కసారిగా స్టార్స్ అయిపోరు కదా. అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఒకరికి స్టార్ ఇమేజ్ తేవాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది వారి చేతిలోనే ఉంటుంది. అలాంటప్పుడు స్టార్ కిడ్స్ సినిమాలు చూడటం మానేస్తే సరిపోతుంది. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా సినిమా చూడాలని చెప్పరు కదా’ అంటూ కరీనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
కరీనా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరీనాకు బాగా అహంకారం పెరిగిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె సినిమాలని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. కరీనా బ్యాగ్రౌండ్ కూడా ఆమెపై ట్రోల్ చేయడానికి ప్రధాన కారణంగా తెలు స్తోంది.
ఎందుకంటే కరీనా తండ్రి రణ్‌ధీర్ కపూర్, ఆమె సోదరి కరిష్మా కపూర్. వారి వారసత్వంగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కరీనా నటనలో తన ప్రతిభతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకొంది. కాగా బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం కరీనా కపూర్‌పై ట్రోల్స్ కారణంగా బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.