మలయాళీ దృశ్యం సినిమాతో గుర్తింపుకు నోచుకుని, ఆ తర్వాత సౌత్ సినిమాల్లో విరివిగా అవకాశాలు పొందుతూ, తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న నివేదా థామస్ తను సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి వివరించింది. ఒక మలయాళీ పత్రిక ఇంటర్వ్యూలో నివేద ఆ విషయం గురించి చెప్పింది.
ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి క్రమంలో తను తన ఫాలోయర్లతో చాట్ చేస్తూ ఉండగా, కొందరు అనుచితమైన ప్రశ్నలు వేశారని నివేద వాపోయింది. ఫాలోయర్లతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాట్ చేయడం తరచూ జరిగేదే. అలాంటి సమయాల్లో వారు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.
ఈ క్రమంలో నివేదను కొందరు నెటిజన్లు కొన్నిచెత్త ప్రశ్నలు అడిగారట. 'నువ్వు కన్యేవేనా?' అంటూ ప్రశ్నలు వేశారంటూ నివేద ఆవేదన వ్యక్తం చేసింది. 'నన్ను పెళ్లిచేసుకుంటావా..కన్యవేనా?' అంటూ నీఛంగా మాట్లాడారని, అలాంటి ప్రశ్నలు వ్యక్తం అయ్యాకా..ఇక వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ఆసక్తి కూడా పోయిందని నివేద వ్యాఖ్యానించింది.
కొందరు అర్థవంతమైన ప్రశ్నలే అడిగినా, మరి కొందరు మాత్రం అలా దారుణంగా మాట్లాడారని ఈ యంగ్ హీరోయిన్ వాపోయింది. సోషల్ మీడియాలో అలాంటి పైత్యకారులకు కొదవేమీ లేదు కదా!