టాలీవుడ్ హీరోలు తమ దగ్గరున్న డబ్బుని రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటారు. మరికొందరు ఖరీదైన కార్లు కొనుక్కుంటారు. ఇంకొందరు రెస్టారెంట్లలో, క్రీడా ఫ్రాంచైజీల్లో పెడుతుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. చాలామంది నటీనటులు ఇప్పుడు ఫామ్ హౌజ్ లపై మనసు పారేసుకుంటున్నారు.
మొన్నటికిమొన్న బెల్లంకొండ శ్రీనివాస్, హైదరాబాద్ శివార్లలో పెద్ద ల్యాండ్ తీసుకున్నాడు. అక్కడో ఫామ్ హౌజ్ కట్టాలనేది అతడి ప్లాన్. ఇప్పుడు ఇదే బాటలో ఎన్టీఆర్ కూడా నడుస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ శివార్లలో ఓ స్థలం తీసుకున్నాడు.
హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లికి దగ్గర్లో ఉన్న గోపాలపురంలో 6 ఎకరాల ఫామ్ ల్యాండ్ తీసుకున్నాడు తారక్. తాజాగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. స్వయంగా ఎన్టీఆర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి వేలిముద్రలు, సంతకాలు పెట్టి వచ్చాడు.
ఇప్పుడా 6 ఎకరాల ల్యాండ్ లో ఫామ్ హౌజ్ ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ భార్య ప్రణతికి అప్పగించాడు. ఆమె అభిరుచికి తగ్గట్టు ఆ ఫామ్ హౌజ్ ను అభివృద్ధి చేయాలనేది ఎన్టీఆర్ ఆలోచన. ఇదే ప్రాంతానికి దగ్గర్లో పవన్ కల్యాణ్ కు కూడా ఫామ్ హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇల్లు కట్టడం ఈజీ. కానీ ఫామ్ హౌజ్ అభివృద్ధి చేయడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. 6 ఎకరాల స్థలంలో ఓవైపు ఇల్లు కట్టుకోవడంతో పాటు, మిగతా స్థలాన్ని ప్రణాళికాబద్ధంగా రకరకాల చెట్లు, పూలమొక్కలు, తోటలతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ వ్యవహారాలన్నింటినీ ఎన్టీఆర్ భార్య చూసుకుంటారట.