ఆస్కార్ అకాడమీలో చేరాల్సిందిగా ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ఆహ్వానాలు అందాయి. ఈ ఏడాది 398 మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానాలు పంపగా, ఆ జాబితాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కు స్థానం దక్కింది.
ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు చరణ్, తారక్. సినిమాలో నాటు-నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావడంతో, వీళ్లి క్రేజ్ మరింత పెరిగింది. దీంతో సహజంగానే అకాడమీలో చేరాల్సిందిగా వీళ్లకు ఆహ్వానాలు అందాయి.
చరణ్-తారక్ తో పాటు ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ కు కూడా ఆహ్వానాలు అందాయి. వీళ్లతో పాటు ఇండియా నుంచి మణిరత్నం, కరణ్ జోహార్ కు కూడా లిస్ట్ లో చోటు దక్కింది.
ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులంతా తదుపరి ఆస్కార్ నామినేషన్లలో వివిధ విభాగాల్లో సినిమాలకు ఓట్లు వేసే అర్హత సాధించారు. అవార్డుల్లో మరింత వైవిధ్యం తీసుకొచ్చేందుకు, బెస్ట్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు, కొన్నేళ్లుగా ఆస్కార్ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు స్థానం కల్పిస్తూ వస్తోంది. గతంలో సూర్య, ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్ కూడా ఆహ్వానాలు అందుకున్నారు.