వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ ను కలిసేందుకు, అతడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చారు. పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే టైమ్ లో పవన్ కోసం తమ సినిమాల షూటింగ్స్ ను ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహిస్తామని ప్రకటించారు కూడా.
విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కర్నూలు లాంటి సిటీల పేర్లు కూడా అప్పట్లో తెరపైకొచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మంగళగిరిలో సెట్ వేస్తారని, హరిహర వీరమల్లు కోసం కర్నూలులో సెట్ వేస్తారంటూ ప్రచారం జరిగింది. కట్ చేస్తే, ఆంధ్రాలో పవన్ సినిమాల కోసం ఎక్కడ ఏ సెట్ వేశారనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
వారాహి యాత్ర ప్రారంభానికి ముందు పవన్ సినిమాల స్టేటస్ ఎలా ఉందో, ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాయి. మధ్యలో ఓజీ సినిమా షూటింగ్ మాత్రం 50 శాతం పూర్తయినట్టు ప్రకటన వచ్చింది. మిగతా సినిమాల అప్ డేట్స్ లేవు. ఈ గ్యాప్ లో బ్రో సినిమా టీజర్ కోసం పవన్ డబ్బింగ్ చెప్పినట్టు కొన్ని స్టిల్స్ బయటకొచ్చాయి. ఇంతకుమించి పవన్ సినిమా అప్ డేట్స్ లేవు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు పవన్. అటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కుతున్నాయి. వీటి నెక్ట్స్ షెడ్యూల్స్ వివరాలపై సదరు యూనిట్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు.
అనారోగ్యం కారణంగా తన వారాహి యాత్రలకు పవన్ చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి ఆయన తన పర్యటనల్ని కొనసాగించబోతున్నారు. ఈ రాజకీయ పర్యటనలు ఎప్పుడు ఆపుతారు, తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తారు, వస్తే ఏ సినిమాకు ముందుగా కాల్షీట్లు ఇస్తారనే అంశాల ఆధారంగా ఈ సినిమాల నుంచి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.