బేబి.. ఈ సినిమాపై మొన్నటివరకు చాలా పద్ధతిగా ప్రచారం జరిగింది. 2 సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. ఇందులో భాగంగా విడుదల చేసిన పోస్టర్లు కూడా మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. బేబి సినిమా మరో 'కలర్ ఫొటో'లా కనిపిస్తుందనే అంచనాలు పెంచింది. ఓ మంచి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని చెప్పబోతున్నారని అంతా అనుకున్నారు.
ఈ అభిప్రాయాలన్నీ ఈరోజు జరిగిన ఒకే ఒక్క ఈవెంట్ తో పటాపంచలయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అభిప్రాయాన్ని జస్ట్ 2 పోస్టర్లతో సమూలంగా నాశనం చేశారు మేకర్స్. ఆ పోస్టర్ల కథేంటో చూద్దాం..
ముందుగా ఓ పోస్టర్ చూసుకుంటే.. అందులో మిడిల్ ఫింగర్ పై హీరోయిన్ ను నిలబెట్టారు. జులై 14 రిలీజ్ అంటూ పెద్ద అక్షరాలతో ప్రింట్ చేశారు. ఓ హీరోయిన్ ను, పైగా మహిళను ఇలా మిడిల్ ఫింగర్ పై చూపించడం ఎంతవరకు కరెక్ట్. ఇక రెండో పోస్టర్ విషయానికొస్తే.. హీరోయిన్, హీరోను ముద్దుపెట్టుకోవడానికి రెడీ అవుతుంది. కానీ ఆమె నోట్లో నిలువుగా నిలబెట్టిన లేజర్ బ్లేడ్ ఉంటుంది.
తమ సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్టు, మేకర్స్ ఇలా క్రియేటివ్ గా పోస్టర్లు రిలీజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇలా మిడిల్ ఫింగర్ పై ఓ అమ్మాయిని చూపించడం మాత్రం ఒకింత అభ్యంతరకరమే. విదేశాల్లో ఇలా మిడిల్ ఫింగర్ చూపించడం కామన్. కానీ మన దేశంలో మాత్రం ఇది సరైన పద్ధతి కాదు. అందుకే సినిమాల్లో కూడా ఇలాంటి చర్యల్ని బ్లర్ చేస్తారు సెన్సారోళ్లు. ఇలాంటి అభ్యంతరకర పోజుపై హీరోయిన్ ను నిలబెట్టారు మేకర్స్.
ఇన్నాళ్లూ ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఒపీనియర్ ఉండేది. ఓ ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదా కాలేజీ ప్రేమకథను చూడొచ్చని అనుకున్నారంతా. శాస్త్రీయ పద్ధతిలో కంపోజ్ చేసిన సాంగ్ ఈ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఈ 2 పోస్టర్లు సినిమాకు మరో కలర్ యాడ్ చేస్తున్నాయి.
ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామా అంటున్నాడు హీరో. ఎలాంటి నెగెటివిటీ ఉండదంటున్నాడు మరో హీరో. లవ్ లో పెయిన్ ను చూపించామంటోంది హీరోయిన్. అటు నిర్మాత మాత్రం ఈ సినిమాను పూర్తిగా యూత్ కు అంకితం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. యూత్ చూడాలనుకున్న సీన్లు, ఇప్పటివరకు చూడలేని సీన్లు చాలా ఉన్నాయంటున్నాడు.