ఒకప్పుడు అంటే అభిప్రాయాలు కలిస్తే చాలు అనుకునేవారు ప్రేమకు, పెళ్లికి. కానీ ఇప్పుడు వృత్తులు కూడా కలవాల్సిందే. కానీ ఇలాంటి నేపథ్యంలో ప్రవృత్తులు కూడా వేరైతే? పక్కా కావాల్సిన మ్యాచ్, మిస్ మ్యాచ్ కావడమే కదా? గొడవ పడితే ఒక్కరే గెలుస్తారు..రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు అనే పద్దతి ఒకరిది. అవసరం అయితే ఫైటింగ్ కు రెడీ అనే ఫైటర్ మరొకరు.
గొడవకు కుస్తీకి తేడా తెలియని కుటుంబం ఒకటి-కూతుర్ని మాంచి యోధురాలిగా చూడాలనుకునే కుటుంబం మరొకరది. కానీ ఈ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమికులు గా మారితే, మనసులు మ్యాచ్ అయినా, ప్రవృత్తులు, కుటుంబాలు మ్యాచ్ కాకపోతే…
ఈ అంశం మీద తీసినట్లు కనిపిస్తున్న సినిమా మిస్ మ్యాచ్.
ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. ట్రయిలర్ ద్వారా తెలుస్తున్న విషయాలే అవి. ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ కలిసి అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'.
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ నిర్మల్ తమిళ్ లో చేసిన చదరంగ వెట్టై పెద్ద హిట్, అదే విధంగా 'మిస్ మ్యాచ్' సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.
ట్రయిలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు, నిర్మాతలు, రచయిత తదితరులు పాల్గొన్నారు.