ఈమధ్య వరుసగా వివాదాస్పద చిత్రాలు వస్తున్నాయి. ఒకప్పుడు కూడా వచ్చాయి కానీ అవి అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. కానీ ఈమధ్య వస్తున్న సినిమాలు వివాదాలు రేపడంతో పాటు, హిట్టవుతున్నాయి కూడా.
మొన్నటికిమొన్న ది కశ్మీర్ ఫైల్స్ వచ్చింది, దేశవ్యాప్తంగా హిట్టయింది. ఇక రీసెంట్ గా ది కేరళ స్టోరీ వచ్చింది. ఇది కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడీ కోవలో మరో సినిమా వస్తోంది. దాని పేరు గోద్రా. 2002లో గోద్రాలో జరిగిన సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై తీసిన సినిమా ఇది.
సినిమా టైటిల్ పైనే 'ఇది ప్రమాదామా లేక కుట్రా?' అంటూ క్యాప్షన్ పెట్టారంటే.. ఇది ఎంత వివాదాస్పదమౌతుందో ఊహించుకోవచ్చు. దీనికి సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు.
గోద్రా అల్లర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం అల్లర్లకు కారణమైన అంశాల్ని మరింత లోతుగా విశ్లేషిస్తుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని ప్రకటించిన మేకర్స్.. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దాడిని అత్యంత ఘోరమైనదిగా పేర్కొంది. మతపరమైన అల్లర్లకు కూడా దారితీసిన ఈ దుర్ఘటన, ఉన్మాదంతో జరిగిందా లేక బాగా ఆలోచించి, పక్కా ప్రణాళికతో చేసిన కుట్రనా అనేది సినిమా ద్వారా బయటపెట్టడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. నానావతి కమీషన్ రిపోర్టు ఆధారంగా సినిమా తీసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.
దాదాపు ఐదేళ్ల పాటు పరిశోధించి తెలుసుకున్న షాకింగ్ వాస్తవాలతో ఈ సినిమాను తెరకెక్కించామని చెబుతున్నాడు దర్శకుడు శివాక్ష్. బీజే పురోహిత్ నిర్మించిన ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.