అశ్వనీదత్ సాక్షిగా బయటపడిన ‘మెగా’ మిస్టేక్

చిరంజీవి.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన స్టార్. ఇరుక్కుపోయిన అనే కంటే, ఇమేజ్ చట్రంలో కూరుకుపోయిన హీరో అంటే బెటరేమో. కొన్ని పాత్రలు, కథలకు ఆయన పూర్తిగా దూరమైపోయారు. ఒకే రకమైన పాత్రలు, కథల్ని ఎంచుకుంటూ…

చిరంజీవి.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన స్టార్. ఇరుక్కుపోయిన అనే కంటే, ఇమేజ్ చట్రంలో కూరుకుపోయిన హీరో అంటే బెటరేమో. కొన్ని పాత్రలు, కథలకు ఆయన పూర్తిగా దూరమైపోయారు. ఒకే రకమైన పాత్రలు, కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాల్తేరువీరయ్య లాంటి హిట్స్ తో పాటు, భోళాశంకర్ లాంటి డిజాస్టర్లు కూడా ఇస్తున్నారు.

ఒక టైమ్ లో చిరంజీవి కూడా ఈ 'చట్రం'పై స్పందించారు. ప్రేక్షకులు, అభిమానులు తన నుంచి ఇలాంటి సినిమాలో కోరుకుంటున్నారని, కాబట్టి అలాంటి సినిమాలు తీయక తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిరు ఆవేదనలో సగం మాత్రమే నిజం ఉంది.

చిరంజీవి చెప్పిన మాటలు ఒకప్పుడు నిజం. ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారింది. స్టార్, న్యూ-కమర్ అనే తేడా లేదు. మంచి కథ కనిపిస్తే నెత్తిన పెట్టుకుంటున్నారు. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా 'చట్రం' నుంచి బయటకొచ్చి మంచి కథలు, పాత్రలు చేయాలనుకుంటే చిరంజీవికి ఇదే మంచి అవకాశం. తాజాగా రజనీకాంత్ కూడా జైలర్ రూపంలో చిరంజీవికి పరోక్షంగా దారిచూపించారు.

ఇమేజ్ చట్రంలో కూరుకుపోయి, అదే మైండ్ సెట్ తో ఉన్న చిరంజీవి.. ఆమధ్య ఓ మంచి ప్రాజెక్టును మిస్ చేసుకున్నారు. అదే ఫ్యామిలీ మేన్. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయింది ఫ్యామిలీ మేన్ సిరీస్. ఇప్పటికే 2 సీజన్లు వచ్చేశాయి. నిజానికి ఇది వెబ్ సిరీస్ కాదు. ఓ సినిమాగా మన ముందుకు రావాల్సిన కంటెంట్.

ఫ్యామిలీ మేన్ సబ్జెక్టును చిరంజీవి హీరోగా సినిమాగా తీయాలని అనుకున్నారట దర్శకులు రాజ్-డీకే. ఈ కాంబినేషన్ ను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించాలని అశ్వనీదత్ భావించారు. అప్పటికే ఆయన దగ్గర చిరంజీవి కాల్షీట్లున్నాయి. కానీ ఈ కథను చిరంజీవి రిజెస్ట్ చేశారు.

అప్పటికే రీఎంట్రీ ఇచ్చిన చిరు, ఖైదీనంబర్150తో హిట్ కొట్టారు. దీంతో ఆయన చూపు మరోసారి మాస్-యాక్షన్ సినిమాలపై పడింది. సరిగ్గా అదే టైమ్ లో ఫ్యామిలీ మేన్ లాంటి డిఫరెంట్ సబ్జెక్టు ఆయన దగ్గరకొచ్చింది. దీంతో మరో ఆలోచన లేకుండా చిరు తిరస్కరించారు. కథలో మార్పుచేర్పులు చేద్దామని చెప్పినప్పటికీ వినలేదట.

కట్ చేస్తే.. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ గా వచ్చి అఖండ విజయాన్ని సాధించింది. ఇదే విషయాన్ని తలచుకొని అశ్వనీదత్ తెగ బాధపడ్డారు. ఓ మంచి అవకాశం మిస్సయిపోయిందన్నారు. అంతా తన దురదృష్టం అన్నారు.

చిరంజీవి ప్రయోగాలు చేయరు, ఆయన దృష్టి ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ అంశాలపైనే ఉంటుందనే విషయం ఈ ఉదంతంతో మరోసారి రుజువైంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆడియన్స్ టేస్ట్ మారింది. 'చిరు ప్రయోగాల'కు ఇదే సరైన సమయం. 

ఇప్పటికైనా చిరంజీవి భోళాశంకర్ లాంటి పాత చింతకాయ పచ్చడ్ని పక్కనపెట్టి, కొత్త కథలు, పాత్రలతో వినూత్నమైన ప్రయత్నాలు చేయాలి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించాలి. పనిలోపనిగా జాతీయ అవార్డ్ అందుకోవాలి. ఓ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసులో మాటిది.