విశాఖ ఉక్కు భూములు అదానీ కోసం…?

విశాఖ ఉక్కు కర్మాగారం తమ ప్రాంతంలో వస్తుందంటే ఆశపడి త్యాగాలు చేశారు ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం విశాఖ వాసులు. అలా సమకూరిన వేలాది ఎకరాలలో కొంత భాగం మాత్రమే కర్మాగారం ఉంది. మిగిలినది…

విశాఖ ఉక్కు కర్మాగారం తమ ప్రాంతంలో వస్తుందంటే ఆశపడి త్యాగాలు చేశారు ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం విశాఖ వాసులు. అలా సమకూరిన వేలాది ఎకరాలలో కొంత భాగం మాత్రమే కర్మాగారం ఉంది. మిగిలినది విస్తరణ కోసం ఖాళీగా ఉంది. అయితే ఆ మిగులు భూములను విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే కనుక అదానీకి గంగవరం పోర్టుకు దారాదత్తం చేస్తారని ప్రచారం సాగుతోంది.

దీని మీద కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కేంద్ర ఉక్కు శాఖకు ఘాటైన లేఖ రాశారు. ఉక్కు కోసం త్యాగాలు చేసి ఇచ్చిన భూములు అవి. అందులో ఇప్పటికే వేయి ఎకరాల భూములను గంగవరం ప్రైవేట్ పోర్టు కోసం స్టీల్ ప్లాంట్ రెండు దశాబ్దాల క్రితం ఇచ్చేసింది. ఇపుడు గంగవరం పోర్టు అదానీ యాజమాన్యం పరం అయింది. దీనికి అదనంగా మరో వేయి ఎకరాల ఉక్కు భూములను అదానీకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తూ శర్మ లేఖ రాశారు.

దానికి కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్ర నాధ్  సిన్హా బదులిచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు భూములు భద్రంగానే ఉంటాయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే ప్రతిపాదనలు విరమించుకోవాలని ప్లాంట్ ని బలోపేతం చేసేందుకు సొంత గనులను కేటాయించాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని శర్మ కేంద్రాన్ని కోరారు. 

ఏ రోజు అయితే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అని చెబుతారో ఆ రోజు విశాఖ జనం నుంచి భారీ ఎత్తున నిరసన వస్తుందని ఆయన హెచ్చరించారు. విశాఖ ఉక్కు అన్నది సౌతిండియాకే కీలకం అని అన్నారు. భూములు అదానీకే కట్టబెట్టాలన్న ప్రయత్నాల మీద కూడా ఇపుడు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. ఉక్కు చుట్టూ విశాఖ రాజకీయం తిరుగుతోంది.