దేవుడి దగ్గరకి ఒక అన్న.. దేవుడిచ్చిన మరో అన్న

రక్షాబంధన్.. దేశమంతా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ. ఆ మహిళ కూడా అలానే ఎంతో ఆనందంగా పుట్టింటికి వచ్చింది. అన్నకు రాఖీ కట్టాలనుకుంది. అంతలోనే అన్న ప్రాణాలు కోల్పోయాడని తెలిసి రోదించింది. మృతదేహానికి రాఖీ…

రక్షాబంధన్.. దేశమంతా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ. ఆ మహిళ కూడా అలానే ఎంతో ఆనందంగా పుట్టింటికి వచ్చింది. అన్నకు రాఖీ కట్టాలనుకుంది. అంతలోనే అన్న ప్రాణాలు కోల్పోయాడని తెలిసి రోదించింది. మృతదేహానికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ఉంటున్న అన్న చౌదరి కనకయ్యను చూసేందుకు పుట్టింటికి వచ్చింది చెల్లెలు గౌరమ్మ. ఏటా కట్టినట్టుగానే ఈ ఏడాది కూడా అన్న చేతికి రాఖీ కట్టాలని సంబరపడింది. అప్పటివరకు చెల్లెలితో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు.

ఏం జరిగిందో తెలుసుకునేలోపే కనకయ్య మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు. కళ్లముందే కుప్పకూలిన అన్నయ్యను చూసి గౌరమ్మ తట్టుకోలేకపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చింది. తన వెంట తెచ్చుకున్న రాఖీని, మృతదేహానికి కట్టి ప్రేమను చాటింది.

అలా కడసారి అన్నకు రాఖీ కట్టి చెల్లెలి ప్రేమను చాటుకుంది గౌరమ్మ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కర్ని కదిలిస్తోంది.

దేవుడిచ్చిన అన్నయ్య.. ఏపీపీ రవీంద్ర..

మరోవైపు మరో అన్నచెల్లెల బంధానికి వేదికగా మారింది హైదరాబాద్. నిజానికి వీళ్లు అన్నచెల్లెళ్లు కారు. కానీ ఆ అన్న కోసం ఆమె పరితపించింది. ఆ అన్న ఎవరో కాదు.. సికింద్రాబాద్ మహంకాళీ ఏపీసీ రవీంద్ర.

తొమ్మిదేళ్ల కిందట పాతబస్తీలో సీఐగా పనిచేశారు రవీంద్ర. అదే టైమ్ లో కవిత అనే ఒంటరి మహిళ, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. ఆమెకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటి మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కడుపులో కణతులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న రవీంద్ర, ఆమెకు ఆపరేషన్ చేయించాడు. ఆ టైమ్ లో ఓ మహిళ కానిస్టేబుల్ ను కూడా తోడుగా ఇచ్చారు.

అలా చావు దరిదాపుల వరకు వెళ్లిన కవిత, రవీంద్ర చలవతో బతికింది. అదే టైమ్ లో రవింద్ర ట్రాన్సఫర్ అయ్యారు. ఆ తర్వాత ఏసీపీగా పదోన్నతి కూడా పొందారు. కవితకు ఆయన కనిపించలేదు.

మళ్లీ ఇన్నేళ్లకు సిటీ బస్సులో వెళ్తున్న కవితకు సికింద్రాబాద్ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న రవీంద్ర కనిపించారు. వెంటనే బస్సు దిగి రవీంద్ర వద్దకు వెళ్లింది. జరిగిందంతా చెప్పి తనను తాను పరిచయం చేసుకుంది. రవీంద్రను దేవుడిచ్చిన అన్నగా చెప్పుకొచ్చింది.