ఎగ్జిబిటర్లు- డిస్ట్రిబ్యూటర్లు కలిసి నైజాంలో షేరింగ్ పద్దతి తీసుకురావడం మీద టాలీవుడ్ నిర్మాతల్లో అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే గ్రేట్ ఆంధ్ర డిటైల్డ్ కథనాలు అందించిన సంగతి తెలిసిందే. యువ నిర్మాత బన్నీ వాస్ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఈ ఏడాదిలో నాలుగు నెలల పాటు థియేటర్లకు వ్యాపారం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితికి దారి తీసి వుండొచ్చని, కానీ. అంత మాత్రం చేత ఇదే పరిష్కారం కాదని బన్నీ వాస్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నైజాంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కుదుర్చుకున్న థియేటర్ల ఆదాయం షేరింగ్ అగ్రిమెంట్ కారణంగా చిన్న సినిమాలు దారుణంగా నష్టపోతాయన్నారు.
చిన్న సినిమాలకు ఓపెనింగ్ అంతగా వుండదని, తొలివారంలో మౌత్ టాక్, రివ్యూలు, అన్నీ కలిసి మలివారం నుంచి పికప్ కావడం మొదలవుతుందని అన్నారు. అలాంటిది మలివారం నుంచి వచ్చే ఆదాయంలో 70 శాతం ఎగ్జిబిటర్ తీసేసుకుంటే ఇక చిన్న సినిమా నిర్మాతలు ఏం కావాలన్నారు. చాలా చిన్న సినిమాలు మంచి ఆదాయం సంపాదించింది రెండో వారం తరువాతే అన్నది ఇక్కడ గమనించాల్సి వుందన్నారు.
తనకు థియేటర్లు వున్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు కోట్లు నష్టం వచ్చిందని, తనకే అంత నష్టం వస్తే, ఎన్నో థియేటర్లు వున్న వాళ్లకు ఎన్ని కోట్లలో నష్టం వచ్చి వుంటుందో అంచనా వేసుకోవచ్చు అన్నారు. అంత మాత్రం చేత ఓ నిర్మాతగా ఈ అగ్రిమెంట్ ను సమర్దించలేనని అన్నారు. ఎందుకంటే చిన్న, మీడియం సినిమాలకు ఈ అగ్రిమెంట్ దారుణంగా నష్టం చేస్తుందన్నారు. ఈ విషయం తాను ఛాంబర్ లో కూడా చర్చకు తీసుకురావాలనుకుంటున్నానని బన్నీవాస్ చెప్పారు.
నిజానికి ఎగ్జిబిటర్లు అంతా పోరాడాల్సింది ఓటీటీ విడుదల మీద అని, ఎనిమిది వారాల నిబంధన కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని అన్నారు. ఇప్పటికే వారం నుంచి రెండు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయన్నారు. ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్ ఆదాయం ఇక రాదు అని తేలిపోతే, ఇంకా త్వరగా ఓటీటీలోకి వెళ్లిపోతాయన్నారు. నైజాంలో కుదిరిన కొత్త ఒప్పందం ఈ పరిస్థితికి దారి తీస్తుందని బన్నీవాస్ చెప్పారు.
ఓటీటీ విడుదల టైమ్ మీద పోరాటం చేస్తేనే థియేటర్ల మనుగడ సాధ్యం తప్ప, ఇలాంటి అగ్రిమెంట్ల వల్ల కాదన్నారు. చిన్న సినిమాలు థియేటర్ కు దూరమైతే, కేవలం పెద్ద సినిమాలతోనే ఏడాది పొడవునా మనుగడ సాధ్యం కాదన్నారు. ఈ విషయమై చాంబర్, కౌన్సిల్ చర్చించాల్సిన అవసరం వుందని బన్నీ వాస్ అన్నారు.