బెంగళూరు రేవ్ పార్టీ కేసు మొత్తం నటి హేమ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. అదే పార్టీలో ఏపీ మంత్రి కాకాని స్టిక్కర్ తో ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఈ మొత్తం వివాదంపై 2 రోజుల కిందటే హైదరాబాద్ లో కాకాని స్పందించారు. ఈరోజు నెల్లూరులో మరోసారి ప్రెస్ మీట్ పెట్టి, పూర్తి ఆధారాలతో మీడియా ముందుకొచ్చారు. రేవ్ పార్టీలో పట్టుబడిన కారు తనది కాదన్నారు కాకాని. దానికి సంబంధించి ఆయన ఆర్సీ కాపీని చూపించారు. తను కొనుగోలు చేసినట్టు లేదా అమ్మినట్టు ఎక్కడా లేదన్నారు.
అంతేకాదు.. ఆ కారుపై ఉన్న స్టిక్కర్ కూడా తన అధికారిక స్టిక్కర్ కాదన్నారు మంత్రి. ఎవరో తన స్టిక్కర్ ను ఫోర్జరీ చేసి ఉంటారని అనుమానించారు. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ప్రదర్శించారు.
బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం దమ్ముంటే రా..
కారులో తన పాస్ పోర్ట్ దొరికిందనే ఆరోపణల్ని కూడా కాకాని తిప్పికొట్టారు. తన పాస్ పోర్ట్ తన దగ్గరే ఉందంటూ మీడియాకు పాస్ పోర్ట్ చూపించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దామని, ఎవరి రక్తంలో ఆల్కహాల్, డ్రగ్స్ ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. సోమిరెడ్డిని పేకాటరాయుడిగా, తాగుబోతుగా అభివర్ణించిన కాకాని.. అతడి రాసలీలలపై పుంఖానుపంఖాలుగా కథనాలు వచ్చాయంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపించారు.
రేవ్ పార్టీ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తను సిద్ధమని, కానీ రాజకీయ లబ్ది పొందేందుకు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని ఘాటుగా స్పందించారు.