చిరు సరసన నాగ్ హీరోయిన్

చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక విశ్వంభర సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నట్టు ఆరంభం నుంచి ప్రచారం సాగుతోంది. కొంతమంది తారల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం దశలవారీగా ఆ హీరోయిన్ల పేర్లను…

చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక విశ్వంభర సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నట్టు ఆరంభం నుంచి ప్రచారం సాగుతోంది. కొంతమంది తారల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం దశలవారీగా ఆ హీరోయిన్ల పేర్లను ఎనౌన్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే. చిరు-త్రిష మధ్య చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు అషికా రంగనాధ్. ఈ ముద్దుగుమ్మను సాదరంగా ఆహ్వానిస్తూ ట్వీట్ వేసింది యూనిట్.

నాగార్జున సరసన నా సామిరంగ సినిమాలో చేసింది అషికా. అందులో ఆమె లుక్స్ తో పాటు, యాక్టింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమానే చిరంజీవి సరసన నటించే అవకాశాన్నందించింది. అంతకంటే ముందు ఆమె కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమా చేసింది.

విశ్వంభర సినిమాలో అషికాతో పాటు.. ఇషా చావ్లా, సురభి కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వీళ్లపై కొన్ని సన్నివేశాలు కూడా తీసినట్టు చెబుతున్నారు. తను చిరు సినిమాలో ఉన్నట్టు ఆమధ్య సురభి ప్రకటించింది కూడా. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా నిర్ధారించలేదు. సరైన టైమ్ లో ఆ ఎనౌన్స్ మెంట్స్ కూడా వస్తాయి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది విశ్వంభర సినిమా. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత చిరంజీవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో ఫాంటసీ మూవీ ఇదే. అటు త్రిషతో కూడా దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా ఇది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న సినిమాను విడుదల చేయబోతున్నారు.