ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్డీఏకు ఎన్నికల కమిషన్ తొత్తుగా మారిందని జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తా పత్రికలు ఏకంగా సంపాదకీయాలు రాసే పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈసీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అమ్ముడుపోయిందని ఆయన ఘాటు విమర్శ చేయడం గమనార్హం. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాయని ఆయన అన్నారు.
ఎన్నికల్లో ఓట్లు వేయడానికి డబ్బులు ఇవ్వాలంటూ అభ్యర్థుల ఇళ్ల వద్ద ధర్యాలు చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే… 2029 ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే అభ్యర్థి ఇంటికెళ్లి కొట్టే పరిస్థితి రాబోతోందని సంచలన కామెంట్ చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఆయన విమర్శ చేశారు. కానీ కూటమిపై ఈగ వాలనివ్వకుండా రామకృష్ణ మాట్లాడ్డం ద్వారా మరోసారి చంద్రబాబు భక్తుడు అని నిరూపించుకున్నారనే విమర్శ వస్తోంది.
సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణకు ప్రధాన టార్గెట్ సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబుపై వాళ్లిద్దరికీ వల్లమాలిన ప్రేమ. దాన్ని బయట పెట్టుకోడానికి రామకృష్ణ, నారాయణ ఏ మాత్రం సిగ్గుపడరు. ఒకవైపు ఈసీని విమర్శిస్తున్నారనే తప్ప, అది ఎన్డీఏ కూటమికి ఎలా ఒత్తాసు పలికిందో మాత్రం విమర్శ చేయడానికి ఆయనకు మనసు ఒప్పకపోవడం గమనార్హం.