మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడంపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈవీఎం ధ్వంసానికి దారి తీసిన పరిస్థితి, అలాగే ఆ వీడియో మాత్రమే లీక్ కావడంపై కూడా సిట్ దర్యాప్తు ప్రారంభించిందని సమాచారం. పల్నాడు, ఇతర ప్రాంతాల్లో ఎన్నికల్లోనూ, అనంతరం జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పల్నాడులో 8, 9 బూత్‌లలో ఈవీఎంల విధ్వంసం జరిగింది. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లికి సంబంధించిన వీడియో మాత్రమే లీక్ కావడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. తాము లీక్ చేయలేదని ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వీడియో లీక్ కావడంపై దర్యాప్తు జరపాలనే డిమాండ్స్ వచ్చాయి.
ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన సిట్… దానిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ అదుపులో ఉండే వీడియో ఎలా లీక్ అయ్యింది? అలాగే ఈవీఎంను ధ్వంసం చేయడానికి కారణాలేంటో నిగ్గు తేల్చడానికి సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే దర్యాప్తు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి కాకుండా జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎందుకంటే సిట్ బృందంలోని అధికారే మాచర్ల ఎమ్మెల్యే వీడియోని టీడీపీ నేతలకు ఇచ్చారనే అనుమానం వుంది. అలాంటప్పుడు తమ టీమ్‌లోని సభ్యుడే తప్పిదానికి పాల్పడ్డారని సిట్ చీఫ్ అంగీకరిస్తారా? అనేది ప్రశ్న. సిట్ విచారణ ఎంత వరకు పారదర్శకంగా జరుగుతుందో చూడాలి.