రాజకీయ నాయకులు మామూలుగానే ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థం కాదు. కొందరు నాయకులు మాట్లాడుతుంటే ఏం చెబుతున్నారో అర్థం కాక విలేకరులు తలకాయలు పట్టుకుంటారు. అలాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో కొందరున్నారు. వాళ్ళ పేర్లు చెప్పుకోవడం అనవసరం. కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగానో, ఆవేశంతోనో, అనాలోచితంగానో కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. కొందరు అహంకారంతో కూడా చేస్తుంటారనుకోండి.
వీళ్ళ కామెంట్స్ వెంటనే మీడియాలో వైరల్ అవుతుంటాయి. చర్చనీయాంశమవుతాయి. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ లేనివిధంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతున్నారు. ఇండియా కూటమిలోని ఏ పార్టీనీ వదిలిపెట్టడంలేదు. మళ్ళీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని దేశవ్యాప్తంగా అంచనాలు ఉండటంతో మోడీకి కూడా ఆత్మవిశ్వాసం పెరిగిందేమో కొద్దిగా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు.
కొన్ని కామెంట్స్ అహంకారపూరితంగా కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే భయంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో తెలియదు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. ఆ ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ తాను బయలాజికల్ గా పుట్టలేదని, దేవుడే తాను చేయాల్సిన పనిని తన చేత (మోడీ ) చేయించడానికి భూమి మీదికి పంపించాడని అన్నారు.
అంటే తాను కారణజన్ముడినని, దైవంశసంభూతుడినని చెప్పుకోవటమన్న మాట. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోడీకి మతి చలించిందని, మానసిక వైద్య నిపుణుడికి చూపించాలని అన్నాడు. ఈ పదేళ్లలో తాను ఎంత గొప్పగా పరిపాలన చేశానో మోడీ ప్రచారంలో అనేకసార్లు చెప్పుకున్నాడు. తన పాలనలోనే అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్ట పెరిగిందని, భారత్ పై ఉగ్ర దాడులు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కు తింటోందని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించే బాధ్యతను దేవుడు తనమీద పెట్టాడని మోడీ అన్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ అనే విధంగా పరిస్థితి తయారైంది. పార్టీలో మోడీ భజన బాగా పెరిగింది. మొన్న ఈ మధ్య ఒరిస్సాలోని ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి పూరి జగన్నాథ స్వామి మోడీ భక్తుడే అని నోరు జారాడు. దీని మీద కూడా ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. చివరకు ఆ ఎంపీ అభ్యర్థి క్షమాపణలు చెప్పి, మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పాడు.
ఉమ్మడి ఏపీ విడిపోయి ఆంధ్రాలో చంద్రబాబు సీఎం అయినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మోడీ ప్రధాని కావడం మన అదృష్టమని, ఆయన్ని ఆ దేవుడే పంపించాడని అన్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలుగానీ, ప్రాంతీయ పార్టీలుగానీ అధినేతలే ప్రధానమైపోయారు. వ్యక్తిపూజ బాగా పెరిగిపోయింది. బీజేపీ దీనికి మినహాయింపు అనుకున్నారుగానీ అందులోనూ వ్యక్తి పూజ పెరిగింది.
ఈ మధ్య బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్కడో మాట్లాడుతూ వాజపేయి, అద్వానీల బీజేపీ వేరని, ఇప్పటి బీజేపీ వేరని అన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడోగానీ అది నిజమే. వారి హయాంలో పార్టీ కేంద్రంగా నాయకులు ఉండేవారు. ఇప్పుడు ఒక నాయకుడు కేంద్రంగా పార్టీ నడుస్తోంది.