మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకి పట్టు విద్యలో మంచి ప్రవేశం వుంది. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటే రాజకీయంగా భవిష్యత్ వుంటుందో ఆయనకు బాగా తెలుసు. కేడర్‌ను నమ్ముకుంటే జేబుకు చిల్లే తప్ప, లాభం లేదని ఆయన గ్రహించారు. అందుకే లీడర్ లోకేశ్‌ను నమ్ముకుంటే భవిష్యత్ వుంటుందని, ప్రస్తుతం ఆయన అదే దారిలో నడుస్తున్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. కూటమికి 130 సీట్లు వస్తాయన్నారు. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే, మరోవైపు టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టాలని సంచలన కామెంట్స్ చేశారు. లోకేశ్ టీడీపీ అధ్యక్షుడైతేనే ఆ పార్టీ 30 ఏళ్ల బతుకుతుందన్నారు. ఇది తన డిమాండ్‌గా ఆయన చెప్పుకొచ్చారు.
కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మి, ఎంతకైనా మంచిదని ఆయన కర్చీప్ వేశారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు వయసు పైబడుతున్న నేపథ్యంలో లోకేశ్ కీలకం కానున్నారని, దీంతో ఆయన వర్గీయుడిగా గుర్తింపు పొందితే పదవులు వస్తాయని బుద్దా తెలివిగా మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలు అంటున్నారు. ఆ మధ్య చంద్రబాబు కోసం రక్తంతో హడావుడి చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.
విజయవాడ వెస్ట్ సీటు ఆశించి, చివరికి బీజేపీకి ఇవ్వడంతో బుద్ధా వెంకన్న సైలెంట్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ చెప్పినట్టు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కోసం పని చేశానని మార్కులు కొట్టడానికి బాగా నటించాడని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా బుద్ధాను విమర్శించారు. ఇప్పుడు లోకేశ్‌ను టీడీపీ అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్‌ను కూడా ఆ కోణంలోనే చూడాలనే చర్చకు తెరలేచింది.