ఆటో జానీ.. ఈ టైటిల్..ఈ సబ్జెక్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ దగ్గర దశాబ్దాల కాలం నుంచి వినిపిస్తోంది. మెగాస్టార్ లేదా పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఈ సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకున్నారని తరచు వినిపించేది.
మెగాస్టార్ సినిమాలు ఆపేసిన తరువాత మరి వినిపించడం ఆగిపోయింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత చిరు మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించారు. పూరి గతంలో అంత ఫామ్ లో లేరు అప్పుడు. ఈ లోగా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. పూరి మళ్లీ పైకి లేచారు. లైగర్ సినిమాతో మళ్లీ ఓల్డ్ ప్లేస్ కు వెళ్లిపోయారు. ఇదంతా వేరే సంగతి.
ఇన్నాళ్ల తరువాత మెగాస్టార్ నే స్వయంగా ఆటో జాని సబ్జెక్ట్ వుందా? ఏం చేసారు? చించేసారా? అని అడిగారు పూరి ని. దానికి సమాధానంగా అలాగే వుంది అని చెప్పలేదు. అది వద్దు..మీ కోసం మరో మాంచి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నా. పూర్తయ్యాక వచ్చి కలుస్తా అన్నారు. ఇక్కడే వుంది. అసలు గమ్మత్తు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఆటో జానీ సబ్ఙెక్ట్ ను పూరి ఎప్పుడో వాడేసారని తెలుస్తోంది. ఆ కథనే టైటిల్ మార్చి, కాస్త అటు ఇటు మార్చి సినిమా తీసేసారని, అదే పైసా వసూల్ సినిమా అని తెలుస్తోంది. పైసా వసూల్ సినిమానే ఆటో జానీ అని పూరికి బాగా సన్నిహితమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారం.
అందుకే పూరి నేరుగా ఆ స్క్రిప్ట్ అలాగే వుందని చెప్పకుండా, వేరే తయారు చేస్తున్నా అని చెప్పారన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆటో జాని/పైసా వసూల్ టైప్ హీరో క్యారెక్టరైజేషన్ బాలయ్య కు భలే సెట్ అయింది. ఆ పాత్రలో మెగాస్టార్ ను ఊహించుకుంటే కాస్త అనుమానంగానే వుంటుంది.