సినిమాల్లో రచయిత పరుచూరి గోపాలకృష్ణ పేరు తెలియని వారు లేరు. వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి గత కొంతకాలంగా సినిమాలపై తన అభిప్రాయాన్ని యూట్యూబ్ వేదికగా జనాలతో పంచుకుంటున్నారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మహేష్ బాబు స్థాయికి సినిమా లేదని ఎక్కడో తేడాగా ఉందన్నారు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ ఇతర సినిమాలతో పోలిస్తే గుంటూరు కారం కొంచెం తేడాగా అనిపించిందని.. సినిమా స్క్రీన్ ప్లే కన్ప్యూజింగ్గా అనిపించిందని.. తల్లి సెంటిమెంట్ ఆధారమైన ఫ్యామిలీ కథకు మాస్ టైటిల్ పెట్టడమే పెద్ద తప్పన్నారు. ఇది కేవలం తన అభిప్రాయం అని ఎవర్నీ విమర్శించడం లేదన్నారు. త్రివిక్రమ్, మహేశ్ సినిమా కాబట్టి డబ్బులు వస్తాయని, కానీ డబ్బులు రావడం వేరు, సంతృప్తి వేరని అన్నారు.
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో దాదాపు పదమూడేళ్ల తర్వాత వచ్చిన సినిమా గుంటూరు కారం సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి టైం చూసుకొని సంక్రాంతి పండుగకు విడుదల చేసిన సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కేవలం మహేశ్ బాబు స్టార్ డమ్తో కొన్ని చోట్ల సినిమా అడింది తప్ప అనుకున్న అంచనాలకు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.