మరో పడవ కూడా ఎక్కుతున్న పవర్‌స్టార్‌…!

జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరో పడవ ఎక్కబోతున్నాడా? ఆయన ప్రస్తుతం రాజకీయ పడవలో ఉన్న సంగతి తెలిసిందే కదా. మరో పడవలో ఎక్కడమేమిటి? అవునండీ…ఎక్కబోతున్నాడు. అదే సినిమా పడవ. ఎప్పుడో వదిలేసిన…

జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరో పడవ ఎక్కబోతున్నాడా? ఆయన ప్రస్తుతం రాజకీయ పడవలో ఉన్న సంగతి తెలిసిందే కదా. మరో పడవలో ఎక్కడమేమిటి? అవునండీ…ఎక్కబోతున్నాడు. అదే సినిమా పడవ. ఎప్పుడో వదిలేసిన సినిమా పడవలో మళ్లీ ప్రయాణం చేయాలనుకుంటున్నాడు.

రాజకీయ రంగంలోకి వచ్చేటప్పుడు సినిమాలు వదిలేస్తున్నానని చెప్పిన పవన్‌ మళ్లీ ముఖానికి రంగేసుకుకోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఆయన, ఆయన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతూనే ఉంది.

అయినా అవునని, కాదని చెప్పలేదు. కాని ఇప్పుడు నిర్మాత దిల్‌ రాజు 'అవును…పవన్‌తో సినిమా చేస్తున్నా' అని క్లియర్‌కట్‌గా చెప్పాడు. ఇంత పెద్ద నిర్మాత ఊరికే సరదాగా చెప్పడు కదా. 

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీయాలనేది తన చిరకాల వాంఛని, అది నెరవేరబోతోందని దిల్‌ రాజు స్పష్టం చేశాడు. హిందీలో విజయవంతమైన 'పింక్‌' చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తాడు.

పవన్‌ కళ్యాణ్‌ డేట్లు ఖరారు కావల్సివుందని, అది కాగానే పూర్తి వివరాలు చెబుతానని దిల్‌ రాజు చెప్పాడు. ఈయన చెప్పిందాన్నిబట్టి పవన్‌ ఓకే చెప్పినట్లుగానే ఉంది. పవన్‌ ఈ సినిమా చేసి హిట్టయితే అక్కడితో ఆగుతాడా? ఈయన ఆగుదామనుకున్నా నిర్మాతలు, దర్శకులు ఆగుతారా? పవన్‌ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే ఆయనతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు కథలు సిద్ధం చేసుకొని రడీగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరు ప్రత్యేకంగా పవన్‌ కోసమే కథలు తయారుచేసుకున్నారు. కాని పవన్‌ ఏమీ చెప్పలేదు. 

మరి ఇప్పుడు దిల్‌ రాజుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడంటే తన నిర్ణయం మార్చుకున్నాడని అనుకోవాలి. 'పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక వచ్చే ఏడాది తీరుతోంది' అని దిల్‌ రాజు ఇంటర్వ్యూలో తన సంతోషం వ్యక్తం చేశాడు. తాను సినిమా రంగానికి స్వస్తి చెప్పానని పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చిన కొత్తల్లో  పవన్‌ చెప్పాడు.

ఎన్నికల సమయంలో జనసేనలోని కొందరు నాయకులు సోదరుడు నాగబాబుతో సహా పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.  ఆయన్ని దైవాంశసంభూతుడిలా కీర్తించారు. నాగబాబు పవన్‌ గురించి మాట్లాడుతూ ''పవన్‌ కళ్యాణ్‌గారిలా గొప్ప విజన్‌ ఉన్న నాయకులు అరుదుగా ఉంటారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మార్పు వచ్చింది. భవిష్యత్తులో కూడా మంచి మార్పులు మనం చూడబోతున్నాం' అన్నాడు. 

పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పుడు నమ్మకం ఉండాలని, ఎదిరించే ధైర్యం ఉండాలని అన్నాడు. పవన్‌ విమర్శకులను నాగబాబు బూతులు తిట్టాడు.   పవన్‌ విమర్శించేవారంతా గాడిదలు, సన్నాసులు, దద్దమ్మలు, రాస్కెల్స్‌…అంటూ బూతుపురాణం చదివాడు.

జనసేన పార్టీ రాజకీయ సలహాదారు రామ్మోహన్‌రావు ఓ సమావేశంలో మాట్లాడుతూ …'పవన్‌ కళ్యాణ్‌ కోహినూరు వజ్రం' అన్నాడు. 'కోహినూరు కంటే వేలరెట్లు ప్రకాశవంతమైన వజ్రం ఆయన. సమాజంలో మార్పు కోసం ఇంతగా తపిస్తున్న వ్యక్తిని నా ముప్పయ్‌నాలుగేళ్ల ఐఏఎస్‌ జీవితంలో ఎన్నడూ చూడలేదు అన్నారు. శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని మోసినట్లు పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే జనసేన పార్టీని మోస్తున్నారు. ఆయన తన ఆస్తులను ఖర్చు చేసి పార్టీని నడుపుతున్నారు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రపంచ రాజకీయ చరిత్రలోనే లేదన్నారు. పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఒకసారి మాట్లాడుతూ గౌతమబుద్ధుడు అహింసతో, వివేకానందుడు విజ్ఞానంతో చెడును పారదోలితే అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి పవన్‌ కళ్యాన్‌ జనసేన పార్టీని స్థాపించారని అన్నారు.

జనసేన పార్టీ మంచివాళ్లకు అండగా ఉంటుందని, చెడ్డవారికి సింహస్వప్నమన్నారు. ఇలాంటి సింహంవంటి నాయకుడు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు. కొంతకాలం క్రితం పవన్‌ అన్నయ్య నాగబాబు తమ్ముడు సినిమాలు చేయబోడని ఖరాఖండీగా చెప్పాడు. 

పవన్‌ ఇక సినిమాల్లో నటించడని, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు మరీ బవవంతం చేస్తే అతిథి పాత్రల్లో నటిస్తాడని  చెప్పాడు. కాని ఇప్పుడు స్టోరీ ఛేంజ్‌ అయింది. దిల్‌ రాజు సినిమాలో వపన్‌ హీరోగా నటిస్తాడు తప్ప అతిథి పాత్రలో ఎందుకు నటిస్తాడు? ఆయన రాజకీయాల్లో సూపర్‌స్టార్‌ కాకపోవచ్చు. కాని సినిమా హీరోగా ఇప్పటికీ ఇమేజ్‌ ఉంది. చూద్దాం…ఆయన రెండు పడవల్లో ప్రయాణం ఎలా సాగుతుందో…!