తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి 11 మంది ఎమ్మెల్యేలు రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ నేతలు తమకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని వీడి మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారంతా సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థానికి వెళ్లినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.
సీఎం రమేశ్ తనయుడి వివాహ నిశ్చితార్థానికి చాలా మంది రాజకీయ ప్రముఖులు వెళ్లారు. వారిలో మొత్తం 75 మంది ఎంపీలున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వెళ్లిన వారంతా బీజేపీలోకి చేరుతున్నట్టుగా కాదు కానీ, టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అనుమానాలు నెలకొంటూ ఉన్నాయి.
తెలంగాణ తరహాలో అధికార పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టుగా అయ్యుంటే ఈ పాటికి చాలా మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకే చేరిపోయే వాళ్లు. అయితే చంద్రబాబు, కేసీఆర్ లకు భిన్నంగా వ్యవహరిస్తామని జగన్ తేల్చి చెప్పారు.
దీంతో ఫిరాయింపులు సాధ్యం కావడం లేదు. అందుకే విలీనం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడం ద్వారా తమ విలీనాన్ని గుర్తించాలని కోరే అవకాశం ఉంది. ఆ ప్రయత్నమే ఇప్పుడు జరుగుతున్నట్టుగా భోగట్టా. అయితే ఆ విలీనాన్ని స్పీకర్ కచ్చితంగా గుర్తించాలని ఏమీ లేదు. వారందరి మీదా అనర్హత వేటు వేసి, స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించవచ్చు.