తాను సీఎం కావడానికి రాజకీయాల్లోకి రాలేదని పదేపదే పవన్‌కల్యాణ్ చెప్పనప్పటికీ…తాననుకున్న మార్పు తేవాలంటే అధికారం మాత్రం తప్పని సరి అని అందరూ చెబుతూ వచ్చారు. అసలు అధికారమే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళితే…ప్రజలు ఆదరించరని కొందరు మేధావులు పవన్‌కు సలహాలిచ్చారు. దీంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పవన్ తీరు మారింది. తనను సీఎం చేస్తే…ఫలానా పనులన్నీ చేస్తానని మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ చెప్పాడు.
కానీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ను జనం ఆదరించలేదు. అంతేకాదు స్వయంగా ఆయన పోటీ చేసిన రెండుచోట్ల కూడా ప్రజలు ఓడించారు. దీంతో సీఎం కావడం పక్కన పెడితే, అసలు అసెంబ్లీ గడప తొక్కలేక పోయాడు.
అయితే పవన్ సీఎం కావాలనే ఆకాంక్షను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెరవేర్చబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న పవన్…తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలసి సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ప్రత్యేకమైంది.
పవన్ కల్యాణ్ 'బద్రి'తో పూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 12 ఏళ్లకు వారిద్దరి కాంబినేషన్‌లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వచ్చింది. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి పవన్-పూరి కలసి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పూరి తన సినిమాలో పవర్‌స్టార్‌ని ముఖ్యమంత్రి పాత్రలో చూపించబోతున్నాడనే చర్చ నడుస్తోంది.
కాగా గతంలో ప్రిన్స్ మహేశ్‌బాబుతో 'జనగణమణ' పేరుతో పూరి జగన్నాథ్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎందుకో ఆ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఆ కథనే పవన్‌కి పూరి చెప్పడం, అందుకు ఆయన ఓకే అని కూడా చెప్పాడట. ఆ కథలో హీరో ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని సమాచారం. షో పవన్ తన సీఎం కోరికను ఆ విధంగా తీర్చుకుంటున్నారన్న మాట.