ఏంటో…ఎవరు ఎవరిని కలవాలనుకుంటారో, ఎందుకు కలవాలనుకుంటారో ఏమీ అర్థం కావడం లేదు. నిత్యానంద…ఈ పేరు చెబితే వెంటనే ఆయన సాగించిన రాసలీలలు గుర్తుకొస్తాయి. ఆయన గురించి కథలుకథలుగా మీడియా రాసింది, కూసింది. నిత్యానంద పేరు వింటే…మరీ ముఖ్యంగా ఆడవాళ్లు జడుసుకుని చస్తారు.
అలాంటిది నిత్యానందను కలవడం తన కోరిక అని నటి మీరామిథున్ చెబుతోంది. ఆయన్ను ఎలాగైనా కలిసి మాట్లాడాలని ఆమె తహతహలాడుతోంది. 'అమ్మా ఆయన అసలే మంచోడు కాదు. అతనితో నీకెందుకు తల్లి' అని నెత్తీనోరు కొట్టుకొని చెబుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు.
మహిళలను, మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై జైలు ఊచలు లెక్క పెట్టి బయటికొచ్చిన నిత్యానంద…పోలీసులు, జైలు బాధల నుంచి తప్పించుకోడానికి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన్ను ఎలాగైనా తీసుకొచ్చి జైల్లో పెట్టాలని ఒకవైపు పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నటి మీరామిథున్ మాత్రం నిత్యానందను కలవరిస్తోంది. అతని ఎలాగైనా కలసి మాట కలపాలని పలవరిస్తోంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన మీరా బిగ్‌బాస్ రియాల్టీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంది.
నటి మీరామిథున్‌పై కూడా పలు కేసులు ఉన్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న మీరామిథున్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను ఆమె విడుదల చేసింది. అందులో నిత్యానందను ఒక్కసారి అయినా కలిసి ఆయనతో మాట్లాడాలన్నది తన కోరిక అని పేర్కొంది. నిత్యానంద రాసిన 'లివింగ్ ఎన్‌లైట్‌మెంట్' అనే పుస్తకంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. మీరామిథున్ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిత్యానందను కలవాలనుకుంటేనే సమాజం అదో రకంగా చూస్తుంది. మరి అన్ని తెలిసి కూడా అతన్ని కలవాలనుకుంటోందంటే…ఏమోలేబ్బా మనకెందుకు ఆమె వ్యక్తిగత విషయాలు.