పవన్ రీఎంట్రీపై పొలిటికల్ గా చాలా దుమారం చెలరేగుతోంది. ఆ పార్టీలో కాస్త ఫేస్ వాల్యూ ఉన్న లక్ష్మీనారాయణ లాంటి నేతలు సైతం పవన్ రీఎంట్రీని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఓవైపు ఇంత దుమారం చెలరేగుతుంటే, పవన్ మాత్రం అస్సలేమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు ఇప్పుడు ఏకంగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవును.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది.
మైత్రీ నిర్మాతల అడ్వాన్స్ పవన్ వద్ద ఎప్పట్నుంచో ఉంది. నామినేషన్ దాఖలు చేసినప్పుడు తన అఫిడవిట్ లో కూడా పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడా అడ్వాన్స్ కు సంబంధించి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ మధ్య హరీష్ శంకర్ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మరీ పవన్ ను కలిశాడు. అప్పుడే వాళ్లిద్దరి మధ్య కథాచర్చలు జరిగాయి. అప్పట్లో ఆ విషయాన్ని ఖండించాడు హరీష్ శంకర్. ఇప్పుడది నిజమైంది.
ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ చేస్తున్నాడు పవన్. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ జంట ఇలా కలిసింది.
చూస్తుంటే, కొన్నాళ్ల పాటు పవన్ పాలిటిక్స్ ను లైట్ తీసుకుంటాడనిపిస్తోంది. వరుసగా 3 సినిమాలకు కమిట్ అవ్వడంతో ఇన్నాళ్లూ ఆయన ఎత్తుకున్న రాజకీయ ప్రాధామ్యాలన్నీ పక్కకెళ్లిపోయినట్టే. ఇకపై పవన్ నుంచి పొలిటికల్ ప్రెస్ మీట్స్ కంటే, ట్విట్టర్ లో ఆయన సంతకం పెట్టే ప్రెస్ నోట్లే ఎక్కువగా కనిపిస్తాయన్నమాట.