జనసేనాని పవన్‌కల్యాణ్‌పై గణ అనే రచయిత ‘ది రియల్ యోగి’ అనే పుస్తకాన్ని రాశారు. ది రియల్ యోగి అని పవన్ గురించి నొక్కి చెప్పడంలో రచయిత ఉద్దేశాన్ని పసిగట్టొచ్చు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ సభలో పవన్ అన్న నాగబాబు కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తమ్ముని గొప్పతనం గురించి నాగబాబు చక్కగా విశ్లేషించారు.
తమ్ముడు కావడంతో పవన్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇటీవల ఒక సభలో పవన్ గొప్ప ఉపన్యాసం చేశారని గుర్తు చేశారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలంటారని, ఇవి ప్రతి ఒక్కరిలో ఉంటాయని నాగబాబు అన్నారు. అరిషడ్వర్గాలపై విజయం పొందితే మనిషి ఏమైనా సాధించొచ్చని తన తమ్ముడు చెప్పిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన తమ్ముడిలా ఒక్కరోజు కూడా ఉండలేనని ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. ఎవరైనా దేవుడని తన తమ్మునితో అంటే… ఒక్క నవ్వు నవ్వి ఊరుకుంటారని అన్నారు. అలాగే డబ్బు కూడబెట్టాలని, రేపటి గురించి ఎలా అనే ఆలోచనే చేయరని పవన్‌లోని పాజిటివ్ అంశాల్ని లోకం దృష్టికి తీసుకొచ్చారు. డబ్బును ప్రేమించని వ్యక్తి ఎవరైనా వున్నారంటే…నిజంగా వారే మహనీయులనడంలో సందేహం లేదు.
మానవాతీత లక్షణాలున్న అరుదైన వ్యక్తి పవన్ కల్యాణ్ అని నాగబాబు అన్నారు. అందుకే తన తమ్ముడు రియల్ యోగి అని నాగబాబు కూడా చెప్పుకొచ్చారు. యోగి అంటే మానవ బలహీనతలకు అతీతుడని అర్థం చేసుకోవాలి. బోగి కాని వాడు యోగి కాలేడని మహాకవి యోగి నిరూపించారు. ఏ వ్యక్తీ పుట్టుకతో గొప్పవాడు కాదు. అతనిలో మార్పునకు పరిస్థితులు తప్పక కారణమై వుంటాయి. పవన్ జీవితం తెరిచిన పుస్తకం.
అందుకే ‘ది రియల్ యోగి’ అని పవన్ గురించి పుస్తకం వెలువడగానే, ఆయనకు సంబంధించిన అనేక అంశాలు చర్చనీయాంశ మవుతున్నాయి. పవన్‌కల్యాణ్ కేవలం టాలీవుడ్ అగ్రహీరో మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో కీలక రాజకీయ నాయకుడు కూడా. ఒక పార్టీ అధినేత అనే విషయాన్ని విస్మరించకూడదు. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశమైంది.
అరిషడ్వర్గాలపై పవన్ పట్టు సాధించి వుంటే… మరెందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒన్, టూ, త్రీ అంటూ పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌లో కొందరు బోగిని చూస్తున్నారు. కామ వాంఛల్ని జయించలేని ఆయన బలహీనతల్ని విమర్శిస్తున్నారు. బోగి నుంచి యోగి వరకూ పవన్… అని పుస్తకానికి టైటిల్ పెట్టి వుంటే బాగుండేదనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
అలాగని పవన్‌లోని పాజిటివ్ అంశాల్ని తోసి పారేయలేమని ఆయనకు అనుకూల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్‌లో ఓ బోగి, యోగి ఉన్నారనే చర్చకు తెరలేచింది.