గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలో పొట్టి వ్యక్తి ఇతడే

ఇంటిలో వేసుకునే కుర్చీలు కూడా 3 అడుగులుంటాయి. కానీ ఇతడు మాత్రం అంతకంటే పొట్టి. కేవలం 2 అడుగులు మాత్రమే ఉన్నాడు. ఇరాన్ కు చెందిన అఫ్షిన్ ఇస్మాయిల్ ఎత్తు కేవలం 65.24 సెంటీమీటర్లు…

ఇంటిలో వేసుకునే కుర్చీలు కూడా 3 అడుగులుంటాయి. కానీ ఇతడు మాత్రం అంతకంటే పొట్టి. కేవలం 2 అడుగులు మాత్రమే ఉన్నాడు. ఇరాన్ కు చెందిన అఫ్షిన్ ఇస్మాయిల్ ఎత్తు కేవలం 65.24 సెంటీమీటర్లు (2 అడుగుల 1.6 ఇంచీలు) మాత్రమే. ఈ ఎత్తుతో ఇతడు సరికొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు.

ఇంతకుముందు ఈ రికార్డ్ కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ హెర్నాండెజ్ పేరిట ఉండేది. ఇరాన్ కు చెందిన ఇస్మాయిల్, ఎడ్వర్డ్ కంటే 7 సెంటీమీటర్లు తక్కువ ఎత్తు కలిగి ఉన్నాడు. అలా ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు ఈ ఇరాన్ వాసి.

గిన్నిస్ బుక్ గుర్తించిన అతి పొట్టి వ్యక్తుల్లో ఇతడు నాలుగో వాడు. ప్రస్తుతం ఇతడి వయసు 20 ఏళ్లు. మరో 10 ఏళ్లు గడిస్తే తప్ప ఇతడు ఇంకో 5 సెంటీమీటర్ల పొడవు పెరగడని వైద్యులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ లోని పశ్చిమ అజర్ బైజాన్ కనుమల్లో ఉండే బుకాన్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు అఫ్సిన్. పుట్టినప్పుడు ఇతడి బరువు కేవలం 700 గ్రాములు. ప్రస్తుతం ఆరున్నర కిలోలున్నాడు. కుర్ద్, పర్షియన్ భాషలు మాట్లాడే అఫ్సిన్ తన ఎత్తు కారణంగా బడికి వెళ్లలేకపోయాడు. ఈమధ్యే తన పేరు రాయడం నేర్చుకున్నాడు.

గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం తొలిసారి తన దేశాన్ని వీడి దుబాయ్ వెళ్లాడు అఫ్సిన్. 24 గంటల్లో 3 సార్లు అతడి ఎత్తును కొలిచి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కించారు అధికారులు. స్మార్ట్ ఫోన్ అంటే అఫ్సిన్ కు చాలా ఇష్టం. కానీ దాన్ని మోయడానికి ఇతడు చాలా ఇబ్బంది పడతాడు.