తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా.. జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. హస్తినాపురంలో జాతీయ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభం అయింది. హైదరాబాదులో ఆవిర్భావ సభ తర్వాత.. ఢిల్లీ వేదికగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. జాతీయ రాజకీయాలదిశగా తన అడుగులు కదుపుతున్నారు. ఆయన ఢిల్లీ పీఠంపై కన్నేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంపై కొడుకు కేటీఆర్‌ను అధివసింపజేసి.. తాను హస్తినప్రస్థానానికి వెళ్లి ముద్ర చూపించాలని ఆరాటపడుతున్నారు. ఇదంతా బాగుంది. కానీ ఇది అనుకున్నంత సులువుగా జరిగే పనేనా? అనేది ప్రశ్న!
హైదరాబాదులో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా కేసీఆర్ ప్రసంగం మిశ్రమ రీతిలో సాగిపోయింది. ఎందుకంటే.. గత ఏడాదిగా మోడీ మీద ఆయన ప్రదర్శిస్తున్న ఆగ్రహం ఆనవాళ్లు ఈ సభలో దొరకలేదు. ప్రతిసారీ మోడీ మీద నిప్పులు కక్కే కేసీఆర్.. ఆవిర్భావ సభలో అంత దూకుడు కనబరచలేదు. గుజరాత్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత.. మరీ అంతగా రెచ్చిపోవడం ముందుముందు చిక్కులు తెచ్చిపెడుతుందనే గుంజాటన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. కానీ.. తన పార్టీ అభిమానులకు ఉత్సాహం ఇవ్వడానికి కేసీఆర్ కొన్నమాటలు చెప్పారు. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తానని ఆయన ఢంకాబజాయించి చెప్పారు. పార్టీ శ్రేణులంతా హర్షాతిరేకాలతో కరతాళధ్వనులు చేశారు.
అది అంత వీజీనా?
‘ఎర్రకోటపై గులాబీ జెండా’ అనేది అంత తేలికైన మాట ఎంతమాత్రమూ కాదు. 543 సీట్లున్న లోక్ సభలో సగానికి పైగా సీట్లు అంటే.. 275 వరకు భారాస సాధించాలి. కేవలం 17 లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్న రాష్ట్రానికి ఇప్పటిదాకా తన రాజకీయ జీవితాన్ని మొత్తం అంకితం చేసిన నాయకుడు… ఈ 68 ఏళ్ల నాయకుడు దేశవ్యాప్తంగా ఆస్థాయికి భారాసను తీసుకువెళ్లడానికి ఇంకా ఎంతకాలం గడువు విధించుకుని ఆమేరకు తన సమయం వెచ్చించగలడు అనేది ప్రశ్న. ఇక్కడ ఇంకోసంగతి కూడా గమనించాలి. తెలుగుదేశం నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ కెరీర్ తర్వాత.. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను మాత్రమే కాంక్షించే నాయకుడిగా కేసీఆర్ తనకు తాను ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కొడుకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక.. తాను హటాత్తుగా దేశం మొత్తాన్నీ ఉద్ధరించేస్తానంటే.. దేశం ఎలా నమ్ముతుంది. ఆయనమీద ఆయన వేసుకున్న తెలంగాణ ముద్ర అనేది ఎప్పటికీ చెరగిపోని పచ్చబొట్టు లాంటిది. తన అవసరం కోసం, తన తాజా వ్యూహం కోసం.. ఆ పచ్చబొట్టు చెరగిపోతుందని కేసీఆర్ ఎలా నమ్మగలుగుతున్నారో తెలియదు.
ఒకవేళ భారాసకు మాత్రమే 275 రావాల్సిన అవసరం లేదు. కూటమిగా ఇతరులతో కలిసి అధికారంలోకి వచ్చినా సరే.. గులాబీ జెండా ఎర్రకోటపై ఎగురుతుంది అనడానికి వీల్లేదు. అలా జరగాలంటే.. కూటమిలో ఎందరైనా ఉండవచ్చు గాక.. కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారాసకు ఒక స్థాయి ఉండాలి. కేవలం 17 సీట్లున్న తెలంగాణలో, 16కు మించి పోరాడే సత్తా కూడాలేని పార్టీ కనీసం అధికారం కోరే కూటమిలో సింగిల్ లార్జెస్ట్ కాగల స్థాయి కలిగి ఉంటుందనుకోవడం భ్రమ. కాబట్టి ఏదో యథాలాపంగా చెప్పిన మాటగానే తప్ప.. సీరియస్ టార్గెట్ లాగా ఇది కనిపించదు.
పాతవ్యూహమే సరైనది..
కేసీఆర్ పాతవ్యూహం వేరు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ.. ‘‘రాష్ట్రంలో వైరం ఉన్నా సరే.. కేంద్రంలో కాంగ్రెస్ ను కూడా కలుపుకుని పోతాం.. దేశం యొక్క విశాల ప్రయోజనాలు ఆశించి అలా చేస్తాం’’ అని ఆయన ప్రకటించి ఉంటే పరిస్థితి ఇంకో తీరుగా ఉండేది. కానీ.. రాష్ట్రంలో సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అందుకు ససేమిరా అన్నారు. కేసీఆర్ ప్రతిపాదనలకు ఎన్డీయేతర పార్టీలన్నీ సై అన్నాయి గానీ.. కాంగ్రెస్ ను కూడా దూరం పెట్టాల్సిన అవసరం వారిలో చాలా మందికి లేదు. ఆ అవసరం కేసీఆర్ వ్యక్తిగతం. కేసీఆర్ వ్యక్తిగత అవసరం కోసం.. కాంగ్రెస్ ను వారెందుకు దూరం చేసుకుంటారనేది ప్రశ్న.
ఆ మాటకొస్తే. . తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తో కలిసినడుస్తున్నట్లుగా కనిపిస్తున్న వామపక్షాల వారు కూడా.. కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నాయ కూటమి అనేది కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదనే అంటున్నారు. ఆయన తాను కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ.. మిగిలిన అన్ని పార్టీలను కలుపుకుని గొప్ప కూటమిగా అవతరించే ఆలోచన చేసినంతవరకు అనేకమంది ఆయన ఆలోచనలకు మద్దతిచ్చారు. కానీ, ఆయన జాతీయ పార్టీని ప్రకటించి.. తానే అధికారంలోకి వచ్చేస్తానని బీరాలు పోవడం ప్రారంభమైన తర్వాత.. అందరూ ఆయనను దూరం పెడుతున్నారు. ఢిల్లీలో జాతీయ పార్టీ ప్రారంభించిన తర్వాత ఇప్పటిదాకా కమ్యూనిస్టు పెద్దలు కూడా ఆయన కార్యాలయానికి వెళ్లి పలకరించలేదంటే.. పరిస్థితిన బేరీజు వేసుకోవచ్చు. ఆయన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ యాదవ్ తప్ప గట్టి జాతీయ నాయకులు లేరు. కుమారస్వామి.. తొలినుంచి కేసీఆర్ కోటరీ మనిషిగానే ఉన్నారు గనుక లెక్కలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో.. కేసీఆర్ గులాబీజెండా ను ఎలా, ఎప్పటికి ఎర్రకోట మీద ఎగరేయగలరు?
ఇప్పటికీ ఆయనకు అదొక్కటే మార్గం. కాంగ్రెస్ ను కలుపుకుంటాం అనే మాట.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాన్నిస్తుంది.. అనేది వారి భయం. అందుకే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక.. ఆ మాట చెప్పేసి.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసిన కూటమికి ఓకే చెప్పడం తప్ప.. కేసీఆర్ వద్ద వేరే ప్రత్యామ్నాయం లేదు.
కర్నాటకలో పోటీచేస్తాం అనేది ఒక్కటే కేసీఆర్ వద్ద ప్రస్తుతానికి ఉన్న కార్యచరణ ప్రణాళిక. అక్కడ కూడా పొత్తుల్లో కుమారస్వామి, దేవెగౌడలు ఎన్ని సీట్లు విదిలిస్తారనేది కీలకం. అసెంబ్లీ సీట్లు అతిగా ఆశించకుండా, పార్లమెంటు సీట్ల విషయంలో తమకు ఎక్కువ కేటాయించమని అడిగితే కేసీఆర్ కు లాభసాటి కావొచ్చు. కానీ ఇలాంటి ప్రతిపాదనకు ఎందురు వప్పుకుంటారో తెలియదు. ఆ కర్ణాటక తప్ప.. మరే ఇతర రాష్ట్రంలో ఆయన కాలు మోపగలరో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆంధ్ర, తమిళనాడుల్లో పార్టీలు ఆయనతో కర్ణాటక జనతాదళ్ లాంటి పొత్తు కూడా పెట్టుకోవు. అసాధ్యం. ఇతర ఉత్తరాది రాష్ట్రాల విషయానికి వస్తే,.. వారు చాలా చిన్నచూపు చూస్తారు. పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకేమిటి? అని నిలదీస్తారు! ఆయన వద్ద ఏం సమాధానం ఉంటుంది. ఆయా ఉత్తరాది రాష్ట్రాల్లో గెలుపోటముల్ని తాను ప్రభావితం చేయగలనని అనలేరు. ఆయనకు అలాంటి బలమున్న సంకేతాలు కూడా లేవు. ఇంత పరిమితమైన రాజకీయ బలంతో.. ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరేస్తానని.. జనాన్ని ఉద్రేకపరచడం కోసం చెప్పేమాటలు నిజం కావడం కష్టం.
ఆదిత్య