త్వరలో పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనిక …వ్యక్తిగతంతో పాటు రాజకీయంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుం టున్నారు. ఇందుకు తాను పుట్టిన ఊరు ఆళ్లగడ్డను అడ్డాగా చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఆమె రాక అక్క, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలిసింది.
ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ఇటీవల తన తల్లి శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆళ్లగడ్డకు వచ్చినప్పటికీ, ఇంటికి వెళ్లకపోవడం గమనార్హం. ఇదే రోజు అఖిలప్రియ కుమారుడి పుట్టిన రోజు అని తెలిసినా, కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మౌనిక ఇష్టపడకపోవడాన్ని గమనిస్తే… ఇద్దరి మధ్య ఎంత తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఆళ్లగడ్డలో రాజకీయంగా ప్రస్థానం మొదలు పెట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని సమాచారం.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల నాటికి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది భూమా కుటుంబం. భూమా నాగిరెడ్డి దంపతుల వరుస ఆకస్మిక మరణాలు ఆ కుటుంబ రాజకీయంపై తీవ్ర ప్రభావం చూపాయి. నాగిరెడ్డి, శోభ దంపతుల రాజకీయ వారసురాలిగా అఖిలప్రియ తెరపైకి వచ్చారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. పోగొట్టుకున్న చోటే వెతు క్కోవడం మానేసి, మరింత నెగెటివిటీని ఆమె సంపాదించుకోవడం గమనార్హం. దీంతో రానున్న ఎన్నికల్లో ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వదనే ప్రచారానికి తెరలేచింది. మరోవైపు అఖిలప్రియ రాజకీయ ఎదుగుదలకు ఆమె భర్త మద్దూరి భార్గవ్‌రామ్ వ్యవహార శైలి ప్రధాన అడ్డంకిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అఖిలప్రియ రాజకీయంగా, అలాగే కుటుంబ పరంగా పూర్తిగా ఒంటరయ్యారు. అఖిలప్రియను విభేదించి వరుసకు అన్న అయిన భూమా కిశోర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్. ఆళ్లగడ్డ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెమ్మదిగా ఆయనపై ప్రజాదరణ పెరుగుతోందన్న వార్తలొస్తున్నాయి.
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో అఖిలప్రియకు అసలు పొసగడం లేదు. అన్నకు పోటీగా నంద్యాలలో అఖిలప్రియ వేరు కుంపటి పెట్టారు. తమ మాటను కాదని నంద్యాలలో అఖిలప్రియ రాజకీయాలు చేయడంపై చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో అక్కపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మౌనిక పావులు కదుపుతున్నారు. మరీ ముఖ్యం గా మంచు మనోజ్‌ను పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో తనకు కొండంత బలం వస్తుందని ఆమె నమ్ముతున్నారు. మంచు కుటుంబం ద్వారా చంద్రబాబు, లోకేశ్, నందమూరి బాలకృష్ణలకు మరింత చేరువ అయ్యేందుకు ఆమె చురుగ్గా ఆలోచిస్తు న్నారు. మరోవైపు మంచు మనోజ్ బలం అవుతుండగా, అఖిలప్రియకు ఆమె భర్త భార్గవ్‌రామ్ బలహీనత అవుతారని ఆళ్లగడ్డ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న తర్వాత ఆళ్లగడ్డలో ఆమె తనదైన రాజకీయాన్ని చేయడానికి ఆమె ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులతో ఆమె ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టారు. అఖిలప్రియతో వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు మౌనికతో టచ్‌లోకి వెళుతున్నారని సమాచారం. అఖిలప్రియ వ్యతిరేకతపై ఆమె రాజకీయ పునాదులను నిర్మించుకు నేందుకు సిద్ధమయ్యారు. మౌనికతో పాటు మంచు మనోజ్‌కు కూడా రాజకీయంగా ఆసక్తి వుంది. ఇద్దరూ కలిసి ఆళ్లగడ్డలో రాజకీయం మొదలు పెడితే మాత్రం… అఖిలప్రియతో పోల్చుకుంటే సానుకూలంగా మారే అవకాశాలున్నాయి.