దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నిర్మాత రెండు మంచి సినిమాలు అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి. టీజర్ చూడగానే జనం అహో అన్నారు. ట్రయిలర్ చూడగానే అదిరిందిగా అన్నారు. కానీ ఓపెనింగ్ ఎందుకు పడలేదు? ఇదీ మిలియన్ డాలర్ క్వశ్చను.
సినిమా విడుదలయిన తరువాత బాగోగులు.. మంచి చెడ్డలు. దాన్ని బట్టి రన్. కానీ కొంతలో కొంత అయినా ఆ టీజర్, ట్రయిలర్ కు, దర్శకుడి ట్రాక్ రికార్డ్ కు, నిర్మాణ సంస్థ పేరును జనాలు కాస్తయినా పరిగణనలోకి తీసుకుంటారు కదా. మరి అలా ఎందుకు జరగలేదు.
అంటే.. టైటిల్. ఎస్.. టైటిల్ నే. జనం ఈ సినిమా టైటిల్ చూసి అదేదో కులాల కుంపట్ల సినిమా అని ముందే డిసైడ్ అయిపోయారు. పెదకాపు అనేది కులానికి సంబంధించి కాదు, అన్ని కులాల్లోనూ పెద కాపు అనే పదం వాడుక వుంది అని దర్శకుడు ఎంత చెప్పినా, అది జనం వరకు చేరలేదు.
పైగా ఆంధ్రలో ఇప్పుడు కులాల కుమ్ములాటలే నడుస్తున్నాయి. కమ్మ.. రెడ్డి.. కాపు.. ఇలా జనం నిలువునా చీలిపోయారు చాలా వరకు. అలాంటి టైమ్ లో పెదకాపు అనే టైటిల్ పెట్టడం అంటే సాహసమే. రెడ్డి, చౌదరి, నాయుడు టైటిళ్లు పెడితే జనం సినిమాలు చూసారు కానీ కాపు అనే టైటిల్ పెడితే అంత ఆసక్తి వుండదని అనుకోవాలి.
పోనీ కాపులు అయినా చూడాలి కదా.. తమ కులం మీద టైటిల్ పెట్టినందుకు. అబ్బే.. అలాంటి వ్యవహారం పెద్దగా కాపుల్లో వుండదు. సినిమా బాగుంటే సరే. బాగా లేదు అంటే అది అజ్ఙాతవాసి అయినా, భోళాశంకర్, ఆచార్య అయినా ఇట్టే పక్కన పెడతారు. మనోడి సినిమా అని, ఎలాగైనా ఆడించి తీరాలనే యావ అయితే పాపం, కాపుల్లో లేదు. అందువల్ల పెదకాపు అని టైటిల్ పెట్టినా, సినిమా ఎలా వుందో తెలుసుకునే వాళ్లు వచ్చేది.
అయినా శ్రీకాంత్ అడ్డాల కూడా ఎందుకు మొహమాట పడ్డారో అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ, జెండా చూపించారు కదా. అక్కడ మొహమాట పడలేదు కదా. రెడ్డి, కమ్మ, కాపు కులాల సింబాలిక్ గా పేర్లు కూడా పెట్టేసి, డైరక్ట్ గా, క్లారిటీగా కథ చెప్పేసి వుంటే సెట్ అయ్యేదేమో? మంచి నటన కనబర్చాడు అనిపించుకున్న కుర్రాడి కెరీర్ కు బూస్ట్ ఇచ్చే సినిమా అందించలేకపోయాడు.