కరోనా ఏ స్థాయిలో భయపెడుతున్నదో చెప్పేందుకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. సుడిగాలి సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను జనం అడ్డుకున్నారు.
హైదరాబాద్ నగర పరిధిలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బీ బ్లాక్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా షూటింగ్‌ను ఆ కాలనీలో చేపట్టారు. షూటింగ్ స్టార్ట్ అయిన కాసేపటికే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైందనే హెచ్చరికలు చేస్తున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో నివాసాల మధ్య షూటింగ్ చేపట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. అయితే ముందస్తు అనుమతి తీసుకుని షూటింగ్ చేపట్టారని, ఎలా అడ్డుకుంటారని పోలీసులు ప్రశ్నించడంతో పాటు జనాన్ని వారించారు. దీంతో అక్కడి నుంచి జన సమూహం వెళ్లిపోయింది.
కాగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో కమెడియన్‌గా సుధీర్‌కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు.